పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి

కడప ఉక్కును సత్వరం చేపట్టాలి

కడప,నవంబర్‌28(జనం సాక్షి): యువతకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పరిశ్రమలు రావాలని సిపిఎం కార్యదర్వి జగదీశ్వర్‌ అన్నారు. ప్రైవేటు, లేదా ప్రభుత్వ రంగాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడం మాని, ఇచ్చిన హావిూలను అమలు చేయాలని, ఉక్కు పరిశ్రమకు కడపలో శంకుస్థాపన చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షల మంది యువత చదువులు చదివి, ఉపాధి కోసం వెతుకులాడుతున్నారని అన్నారు. ఇన్ని లక్షల మందికి ఉపాధి లభించాలంటే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవు తాయన్నారు. ప్రపంచంలోనే ఇనుము ఎక్కువుగా ఉండేది మన దేశంలోనేనని, 25 శాతం ఖనిజం లభిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కు సంబంధించి అధ్యయన కమిటీలు వేసిందన్నారు. ఒక కమిటీ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం కింద ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లో ఉక్కు పరిశ్రమ సాధ్యాసాధ్యాలు పరిశీలించి పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలయాపనను చూస్తుంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పక్కనపెట్టినట్లే కనిపిస్తుందని చెప్పారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టడం సాధ్యమం కాదని తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. జిల్లాలో, రాయలసీమలో నాణ్యమైన ఇనుప ఖనిజం లేదనడంలో వాస్తవం లేదని, ఇదే ఇనుప ఖనిజం జపాన్‌, చైనా దేశాలకు ఎగుమతవుతుందని పేర్కొన్నారు. నాణ్యత లేకపోతే ఎందుకు ఆ దేశాలు తీసుకుంటాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాయలసీమతో పాటు బళ్లారిలో పెద్ద ఎత్తున ఇనుప ఖనిజం ఉందని తెలిపారు. ఖనిజం ఉన్నాలేదని ప్రభుత్వం చెబుతున్న విషయాలను ప్రజలు గమనించాలని కోరారు. విశాఖలో ఎలాంటి ఇనుప ఖనిజం లేకున్నా పరిశ్రమను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పరిశ్రమలు, సాగునీటి విషయంలో ప్రభుత్వం అశ్రద్ద వహిస్తోందని విమర్శించారు. 30 సంవత్సరాలకు పైగా ఏ ఒక్కసాగునీటిని పూర్తి చేయలేదని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. నిరంతరం కరువుతోటి, వలసలకు గురవుతున్న ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోతుందని పేర్కొన్నారు. చదువుకున్న నిరుద్యోగులు ఇతర రాష్టాల్రు, దేశాలకు పయనవుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం భారీ ఉక్కు పరిశ్రమను నిర్మించి అభివృద్దే ప్రధాన అంశంగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.