పశువైద్యం కోసం పెరిగిన వసతులు

ఊపిరి పీల్చుకుంటున్న అన్నదాతలు
ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పశువులకు బార్‌కోడ్‌ విధానం అమల్లోకి వస్తే మూగజీవాలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయని పశుసంవర్థక అధికారులు అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రోగాలు వచ్చిన సమయంలోనూ జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు, ప్రయోగశాల అధికారులు పశువులకు ఎలాంటి చికిత్స ఇవ్వాలో కూడా సూచించే వీలు కలుగుతందని అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి జిల్లా, పట్టణప్రాంతాలకు చికిత్స నిమిత్తం వాహనాల్లో తీసుకొచ్చే అవసరం ఇక ఉండదన్నారు. ఈ విధానంతో మూగజీవాలకు సకాలంలో సేవలు అందడంతో పాటు రోగనిర్ధరణ కూడా తొందరగా సాధ్యమవుతుంది. దీంతోపాటు పశువులను ఎవరికి అమ్మినా వారి పేరిట ఈ సమాచారాన్ని బదాలియించే వీలు కూడా ఇందులో ఉంటుందన్నారు. అలాగే గతంలో పశువులు ఎవరి వద్ద కొనుగోలు చేశారు.. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయో సునాయసంగా తెలుసుకోవచ్చు. ఒక్కసారి పశువుల సమాచారం నమోదైతే అవి చనిపోయేంత వరకు సమాచారం ఉంటుంది. పశుగణన కూడా సక్రమంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ విధానంపై ఇప్పటికే జిల్లాలో పశువైద్యులకు అవగాహన కల్పించారు.సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో పశువులు రాత్రింబవళ్లు బయట తిరుగుతూనే ఉంటాయి. దీంతో కొన్ని పశువులు ఆగంతకుల బారిన పడి గుట్టుచప్పుడు కాకుండా కబేళాలలకు తరలిపోతున్నాయి. మరికొన్నింటిని దొంగలు అడ్డదారిలో రహదారి పత్రాలు సృష్టించి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. పశుసంపద వృద్ధికి వివిధ సంక్షేమ పథకాల కింద గేదెలు, ఆవులు, ఎడ్లజతలు, మేకలు, గొర్రెలు అందజేస్తునప్పటికీ కొంత మంది డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఇంట్లోనే పాడిపశువులను చూపెట్టి నిధులు కాజేస్తున్నారు. కానీ ఇనాఫ్‌ విధానం అమలైతే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. ఎవరికి అమ్ముకోవాలన్న పశువుల సమాచారం ఇనాఫ్‌ కింద నమోదై సమాచారం చనిపోయెంత వరకు సంక్షిప్తంగా ఉండటంతో దొంగతనాలు, అక్రమాలకు తావుండదు. ఇష్టం వచ్చినట్లుగా కబేళాలకు తరలించేందుకు వీలు ఉండదన్నారు.