పసుపు మార్కెట్‌ ఏర్పాటుకు డిమాండ్‌

గిట్టుబాటు ధరలురావాలంటే తప్పదంటున్న రైతులు

ఆదిలాబాద్‌,ఎప్రిల్‌11(జ‌నంసాక్షి): జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన పంటను నిజామాబాద్‌, మహారాష్ట్రలోని బోకర్‌, ధర్మాబాద్‌, సాంగ్లిలోని మార్కట్లకు తీసుకుని వెళ్లి విక్రయించాల్సి రావడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీంతో రైతులపై ఆర్థికంగా అదనపు భారం పడుతోంది. అక్కడి వ్యాపారులు కమిషన్ల పేరిట దోపిడీ చేస్తుండడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు 150 కిలో విూటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్‌ మార్కెట్‌లో పంటను అమ్ముకోవాలంటే క్వింటాలుకు రూ.200 రవాణా భారం పడుతోంది. మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే రూ.250కిపైగా ఖర్చులు అవుతున్నాయి. నిలకడ లేని ధరలతో విపణికి వెళ్లిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పసుపు సాగు చేసిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు తమ పంట ఉత్పత్తులను మహారాష్ట్రకే తరలిస్తున్నారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం దగ్గరగా లేకపోవడం, సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో అనేకమంది రైతులు పసుపు అమ్మకుండా కళ్లాల్లోనే ఉంచారు. పసుపు పంటకు గిట్టుబాటు ధరతో పాటు జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని తాంసి, భీంపూర్‌ మండలాల రైతులు కోరుతున్నారు. జిల్లాలో పసుపు మార్కెట్‌ లేకపోవడంతో అధిక రవాణా ఛార్జీలు చెల్లించి నిజామాబాద్‌, మహారాష్ట్రలోని సాంగ్లి, బోకర్‌ విపణులకు తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు కూటమిగా మారి నాణ్యత పేరిట ధర తగ్గించి కోనుగోలు చేస్తున్నారు. కమిషన్‌ పేరిట క్వింటాలుకు రూ.100 నుంచి రూ.150 వరకు తీసుకోవడం, కూలీలకు 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా రైతు అడుగడుగునా సమర్పించుకోవాల్సి వస్తోంది. నిజామాబాద్‌, మహారాష్ట్ర మార్కెట్లలో వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జిల్లాలో పసుపు మార్కెట్‌తో పాటు శీతల గిడ్డంగుల నిర్మాణానికి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.రవాణా, కమిషన్‌ ఇతర ఖర్చులతో క్వింటాలుకు రూ.500 వరకు నష్టపోతున్నారు. వాణిజ్య పంట కావడంతో గతేడాది మార్కెట్‌లో మంచి ధరలు ఉండడంతో ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. పసుపు పంటకు పేరుగాంచిన నిజామాబాద్‌, నిర్మల్‌, ఆర్మూర్‌ ప్రాంతాల రైతుల కంటే అధికంగా ఆదిలాబాద్‌ రైతులు దిగుబడులు సాధించారు. ఈ ఏడాది గిట్టుబాటు ధర అంతంతమాత్రంగానే ఉండడం.. జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం లేక పంట ఉత్పత్తులు సకాలంలో అమ్ముకోలేక నష్టపోయారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు పసుపు సాగుపై దృష్టిసారించి పంటపండించారు. జిల్లాలో అత్యధికంగా భీంపూర్‌, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, జైనథ్‌, ఆదిలాబాద్‌ మండలాల్లో సాగు చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పంట ఏపుగా పెరిగి, దిగుబడిపై ఆశలు పెరిగాయి. పెట్టుబడి ఖర్చుల కింద ఎకరానికి రూ.60 వేలకుపైగా పెట్టారు. రైతుల అనుభవంతో పాటు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించి, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడులు

సాధించారు. అయితే పంట ఉత్పత్తులు చేతికివచ్చిన సమయంలోనే ధర పూర్తిగా తగ్గింది. పసుపు ధర నాణ్యతను బట్టి క్వింటాలుకు రూ.5 వేల నుంచి 5,500 వరకే పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఇప్పుడున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు పంటను, పొలాల్లో నిల్వ ఉంచుకునే మార్గం లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.