పాకిస్తాన్లో ఎట్టకేలకు ముగిసిన సాధారణ ఎన్నికలు
పొరుగు దేశం పాకిస్థాన్ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఈ ఫలితాల్లో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ 17 స్థానాల్లో గెలుపొందింది. ఇక జైలుశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఏకంగా 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నట్లు పాక్ ఎన్నికల సంఘం వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.కాగా, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈ సారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 135 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.