పాక్ తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ నాసిర్ ఉల్ ముల్క్
ఎన్నికలయ్యే వరకు ఆయనే ప్రధాని
ఇస్లామాబాద్,మే28( జనం సాక్షి ): పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ నాసిర్ ఉల్ ముల్క్ నియమితులయ్యారు. జులై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే ప్రధానిగా వ్యవహరిస్తారని ప్రస్తుత ప్రధాని షాహిద్ ఖకన్ అబ్బాసీ వెల్లడించారు. నాసిర్ ఉల్ ముల్క్ పేరును వ్యతిరేకించే వాళ్లు ఎవరూ ఉండరని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత సయ్యద్ ఖుర్షీద్ అహ్మద్ షాతో కలిసి విూడియాతో మాట్లాడారు. తాత్కాలిక ప్రధాని విషయంలో కొన్ని వారాలుగా అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, ప్రతిపక్ష పాకిస్థాన పీపుల్స్ పార్టీ మధ్య వాదనలు నడుస్తున్నాయి. నాసిర్ ఉల్ ముల్క్ గతంలో పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలిక చీఫ్‌గానూ పనిచేశారు. ఈ గురువారంతో ప్రస్తుత ప్రభుత్వం పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి నాసిర్ తాత్కాలిక ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం తాత్కాలిక ప్రధానికి ఉండదు.