పాక్ మంత్రిపై దుండగుడి కాల్పులు
ఇస్లామాబాద్,మే 7(జనం సాక్షి): పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్ ఇక్బాల్‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్ ఇక్బాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన పాక్ సర్కారు.. విచారణను ముమ్మరం చేసింది. కాల్పులకు పాల్పడిన దుండగుడు నరోవల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఓ సాయుధుడు అషన్ ఇక్బాల్ సవిూపానికి ఎలా చేరుకోగలిగాడనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై హత్యాయత్నం జరగడం పాకిస్థాన్‌లో కలకలం రేపుతోంది.