పాక్ మరో దాష్టీకం
దైత్యాధికారి ఆలయానికి వెల్లకుండా ఆంక్షలు
ఇస్లామాబాద్,జూన్23(జనం సాక్షి): పాకిస్థాన్ మరోమారు తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. అక్కడి భారత దౌత్యాధికారులను తరచూ అవమానిస్తోంది. దీంతో వారు అనేక విధాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి పొందినప్పటికీ కనీసం ప్రార్థనాలయాలకు కూడా వెళ్ళనివ్వడం లేదు. పాకిస్థాన్‌లో భారత హై కమిషనర్ అజయ్ బిసారియాకు శుక్రవారం తన జన్మదినోత్సవం సందర్భంగా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇస్లామాబాద్‌లోని పంజా సాహిబ్ గురుద్వారాకు వెళ్ళేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. కానీ ఆయనను అక్కడికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారు. బిసారియా జన్మ దినోత్సవం సందర్భంగా ఆయన తన సతీమణితో కలిసి గురుద్వారాకు వెళ్ళి ప్రార్థనలు చేయాలనుకున్నారు. కానీ ఆయనను వాహనం నుంచి క్రిందికి దిగేందుకు అధికారులు అనుమతించలేదు. గురుద్వారా సందర్శనకు పొందిన అనుమతి పత్రాలను చూపినప్పటికీ, ఫలితం లేకపోయింది. బిసారియాను ఏప్రిల్‌లో కూడా ఇదేవిధంగా అడ్డుకున్నారు. అప్పట్లో ఎవాక్యూయీ ట్రస్ట్ ప్రోపర్టీ బోర్డు ఆయనను ఆహ్వానించింది. కానీ భద్రతాపరమైన కారణాలను చూపి అధికారులు బిసారియాను అడ్డుకున్నారు. దౌత్యాధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని, వారి భద్రతకు హావిూ ఇవ్వాలని పాకిస్థాన్‌ను భారత ప్రభుత్వం కోరింది. భారతదేశంలో తాము సమస్యలను ఎదుర్కొంటున్నామంటూ పాకిస్థాన్ దౌత్యవేత్తలు ఎదురు దాడికి దిగుతున్నారు. మార్చి 7 నుంచి దాదాపు 26 వేధింపుల సంఘటనలు జరిగాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది.