పాక్‌ మళ్లీ కాల్పులు

3

– యథేచ్ఛగా ఒప్పందాల ఉల్లంఘన

– పాకిస్తాన్‌ హై కమిషన్‌కు సమన్లు

ఢిల్లీ,జమ్ము ఆగష్టు 16 (జనంసాక్షి):

పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. వరుసగా రెండోరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. పూంఛ్‌ జిల్లాలోని మండి, బాలకోట్‌ సెక్టార్లలోని భారత స్థావరాలపై పాక్‌ గుళ్లవర్షం కురిపించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ మనీష్‌ మెహతా తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పాక్‌ భారత స్థావరాలపై కాల్పులు ప్రారంభించింది. దీనిని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పాక్‌ కాల్పుల్లో శనివారం నలుగురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. కారులో ప్రయాణిస్తుండగా వీరి వాహనానికి పాక్‌ ప్రయోగించిన గుండు తగలడంతో మరణించారు. ప్రమాద స్థలానికి స్థానికులు చేరుకుని కారులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో గుండు వచ్చి అక్కడ పడడంతో 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌ కాల్పుల్లో నిన్నటి నుంచి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి ఐదుకి చేరింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఆదేశ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌కు.. భారత్‌ సమన్లు జారీ చేసింది. ఐనప్పటికీ మరోసారి పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘించింది.