పాటల రూపంలో పాఠాలు..
ఆదిలాబాద్ : అక్షరం ముక్కరాని పిల్లలు కూడా సినిమా పాటలను ఈజీగా పాడేస్తుంటారు. పాటలు పాడినంత సులభంగా పాఠ్యాంశాలను గుర్తుంచుకోలేరు. కానీ అక్కడో టీచర్ విద్యార్థులు ఈజీగా గుర్తుంచుకునేలా పాఠ్యాంశాలను బోధిస్తోంది. ఏదో సాధించాలనే తపన ఆమెకు డాక్టరేట్‌ను సైతం తెచ్చి పెట్టింది. టీచర్స్ డే సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలి కృషిపై ప్రత్యేక కథనం.స్కూల్‌కి వెళ్ళాలంటే పిల్లలు భయపడడం కామన్. టీచర్లు చెప్పిన పాఠాలు అర్ధంకాక పరీక్షల్లో విద్యార్థులు తప్పులు రాయడం సహజం. దాదాపుగా ఇది అన్ని పాఠశాలల్లో జరిగేదే. కానీ,.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి బాలికల పాఠశాలల విద్యార్ధులు అలా కాదు.. స్కూల్‌కు వెళ్లాలంటే ఎంతో ఇష్టపడతారు. పాఠాలన్నీ పాటల రూపంలో చెప్పేస్తుంటారు. పిల్లలకు పాఠాలు ఈజీగా అర్ధమయ్యేందుకు ఇదే స్కూల్‌లో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు కవిత ఐదేళ్లుగా శ్రమించారు. ఎంతో కష్టమైన పాఠాలను సైతం ఈజీగా అర్దమయ్యే విధంగా పాటల రూపంలో చెబుతున్నారు. ఇంగ్లీష్ ఒక్కటే కాదు.. అన్ని సబ్జెక్ట్‌లను ఇదేవిధంగా నేర్చుకుంటే పిల్లలకు ఎంతో ఈజీగా ఉంటుందంటున్నారు కవిత. ఇలా నేర్చుకున్న పాఠాలు విద్యార్ధులు జీవితాంతం గుర్తుకుపెట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారుతమ పిల్లలు చదువుల పట్ల చూపిస్తున్న శ్రద్ధకు.. నేర్చుకుంటున్న విధానాన్ని చూస్తూ తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. కవిత టీచర్ చెప్పే విధానం ఎంతో బాగుంటుందని తోటి ఉపాధ్యాయులు సైతం ప్రశంసిస్తున్నారు. విద్యార్ధులు కూడా అలవోకగా పాఠాలు నేర్చుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలను పాటల రూపంలో చెబుతూ కవిత ఎందరో ప్రశంసలు పొందారు.. ఆమె చేసిన పరిశోధనకు గాను ఎస్వీ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ప్రధానం చేసింది.