పాఠశాలలకు సెలవులపై గందరగోళం
ఆలస్యంగా అందిన ఉత్తర్వులు
యధావిధిగా నడిచిన కొన్ని పాఠశాలలు
విజయవాడ,జూన్19(పాఠశాలలకు సెలవులపై గందరగోళం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు మరో మూడు రోజుల పాటు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసినా చాలా పాఠవాలలకు అవి సకాలంలో అందలేదు. సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ కావడంతోమంగళవారం ఉదయం వరకు తెలియలేదు. దీంతో ప్రైవేటు పాఠశాలలతో పాటు కొన్ని ప్రభుత్వ స్కూళ్లూ మంగళవారం ఉదయం యథావిధిగా తెరచుకున్నాయి. సెలవులు పొడిగిస్తున్నట్టు సాయంత్రం ఉత్తర్వులు వెలువరించగా, అవి అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకూ ఇంకా చేరలేదని సమాచారం. ఈ కారణంతోనే పలు ప్రాంతాల్లో స్కూల్స్ నడుస్తుండగా, ఎండల్లో పిల్లలను ఎలా పంపుతామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న ఏపీలోని చాలా ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తొలకరి వర్షాలు పడ్డప్పటికీ, ఆపై నైరుతి రుతుపవనాలు మందగించడంతోనే ఎండ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాతావరణం వేసవిని తలపిస్తుండడంతో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి 21వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకూ మినహాయింపు లేదు. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దుచేస్తాం’ అని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూళ్లకు 19, 20, 21 తేదీల్లో సాధారణ సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాలలు ఈ నెల 22న పున్ణప్రారంభమవుతాయన్నారు.