పాఠశాలలను సన్నద్దం చేయాలి: డిఇవో
ఏలూరు,మే28(జనం సాక్షి): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సంసిద్ధం చేయాలని డిఇవో అన్నారు. విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఎంఈవోలు సమగ్ర వివరాలతో నివేదికలు రూపొందించి త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి సెంట్రలైజ్డ్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాను ప్రభుత్వం ఎంపికచేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో 20 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు వెలువడిన వెంటనే నూతన విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. పాఠశాలలవారీగా ఉన్న విద్యార్థుల వివరాల ప్రకారం హేతుబద్ధీకరణ నిర్వహించి నివేదికలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. 50 మందికంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల వివరాలతో పాటు 40 మందికంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు. సర్వశిక్ష అభియాన్ రూపొందించిన ఇన్‌ఫ్రా యాప్ ప్రకారం వివరాలను పూర్తి చేయాలన్నారు.