పాఠశాలల్లో బయోమెట్రిక్ సన్నాహాలు
ఇక ఖచ్చితంగా హాజరు నమోదుకు అవకాశాలు
కసరత్తు చేస్తోన్న విద్యాశాఖ
హైదరాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి): విద్యాశాఖలో పారదర్శకతను తీసుకుని వచ్చిఏందుకు ఉద్దేశించిన బయోమెట్రిక్ విధానం కోసం కసరత్తు సాగుతోంది. అనేక పాఠశాలల్లో మిషన్లను ఏర్పాటు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయనున్నారు. ఆధార్ నెంబర్ సహాయంతో అనుసంధానం చేసి ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చూసే విధంగా రాష్ట్ర విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ఇప్పటి వరకు విద్యాశాఖలో ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయపాలన పాటించకుండా విధులకు సరిగా హాజరు కాకుండా ఉంటున్నారనే అపవాదులు ఉన్నాయి. ప్రతి ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం పాఠశాల ప్రారంభ సమయం, ముగింపు సమయంలో రెండుమార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో జిల్లాల్లో ఉపాధ్యాయులు ఏ సమయానికి వచ్చేది ఎప్పుడు బయటకు వెళ్లేది ఆన్‌లైన్ ద్వారా తెలియనుంది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం వరకు అనుసంధానం కానుంది. దీంతో ఏ స్థాయి అధికారి అయినా పాఠశాలల కోడ్ ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చారా? రాలేదా? అనే విషయాన్ని క్షణాల్లో తెలుసుకోనున్నారు. ఉపాధ్యాయుల హాజరు నమోదు సక్రమంగా ఉండడంతో విద్యావ్యవస్థ మెరుగుపడనుంది. దీంతో పాఠశాలల పనితీరు మెరుగుపడి విద్యార్థులకు విద్యాబోధన అధికంగా జరిగి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగనున్నారు. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభానికే వీటి ఏర్పాటు జరగాల్సి ఉన్నా ఎందుకనో ఆలస్యం అయ్యింది. అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన విద్యాశాఖ, బయో మెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తూ పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నది. దీనిలో భాగంగానే ప్రతి పాఠశాలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేయనుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ
తరగతులు నిర్వహిస్తున్నారు. వందమంది ఉన్న పాఠశాలకు ఒక మిషన్ చొప్పున ఇవ్వనున్నారు. వందమంది విద్యార్థులు దాటిన పాఠశాలలకు అదనంగా మరో మిషన్‌ను ఇవ్వనున్నారు. ఈ బయోమెట్రిక్ మిషన్‌లో ఆధార్ నెంబర్‌తో పాటు విద్యార్థుల వేలి ముద్రలను నమోదు చేసి ప్రతి రోజు హాజరును వేలి ముద్రల ద్వారా తీసుకోనున్నారు. వీటితోపాటు ఉపాధ్యాయుల హాజరు నమోదు కూడా ఈ యంత్రాల ద్వారానే నమోదు కానుంది.



