పాఠ్యాంశంగా మార్షల్‌ ఆర్ట్స్‌, యోగాను రూపొందించే ప్రయత్నం

కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే… మంచిది

36వ జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ ప్రారంభోత్సవంలో

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలనే చట్టాన్ని రూపకల్పన చేస్తోందని, ఈ చట్టం రూపుదాల్చితే దానిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్షల్‌ ఆర్ట్స్‌, యోగాను పాఠ్యాంశంగా రూపొందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా చేస్తోందన్నారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జపాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ భారత జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌-2019 పోటీలను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…మార్షల్‌ ఆర్ట్స్‌ స్వీయ రక్షణలో, ఆత్మ రక్షణలో, శారీరక దృడత్వాన్ని కాపాడడంలో ఉపయోగపడుతాయని, తద్వారా ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్షల్‌ ఆర్ట్స్‌ ను, యోగాను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. 36వ కరాటే జాతీయ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఆతిధ్యమిస్తున్న హైదరాబాద్‌ నగరం హ్యాపెనింగ్‌ సిటీ అని, తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంమని తెలిపారు. ఇక్కడ హైదరాబాద్‌ బిర్యాని ప్రఖ్యాతి గాంచింద న్నారు. ఇక్కడకొచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల కరాటే చాంపియన్లు, అతిధులు హైదరాబాద్‌ బిర్యానిని రుచి చూసి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్‌, సాండిల్‌ వుడ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రవీందర్‌ జపాన్‌ కరాటే అసోసియేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షిహాన్‌ వై. ఒగురా, జపాన్‌ కరాటే అసోసియేషన్‌ ఇండియా చీఫ్‌ ఇస్‌ స్టక్టర్ర్‌ షిహాన్‌ ఆనంద్‌ రత్న తదితరులు పాల్గొన్నారు.