పాతబస్తీలో ఉద్రిక్తత..

హైదరాబాద్‌, నవంబరు 16:

పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.  పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతేగాక ముందు జాగ్రత్త చర్యగా చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక బారికేడ్లను ఉంచి రాకపోకలను నిలిపేశారు. మక్కామసీదు వద్ద భారీగా భద్రతా దళాలను మొహరింపజేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి వీలుగా పోలీసులు 144వ సెక్షన్‌ను విధించారు. కొంత మంది గుంపులు గుంపులుగా వచ్చి పోలీసులపై దాడి చేశారు. అంతే గాక చార్‌మినార్‌ పరిసరాలలో నిలిపివున్న వాహనాలకు కూడా కొందరు అల్లరిమూకలు నిప్పపెట్టారు. అంతటితో వాహనాల యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చార్‌మినార్‌, అఫ్జల్‌గంజ్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా తదితర సున్నితమైన ప్రాంతాలలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు జరగనున్న సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చార్‌మినార్‌ పక్కన గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేశారు. అయితే ప్రార్థనల అనంతరం ఒక వర్గానికి చెందిన యువకులు చార్‌మినార్‌ వైపు పరుగులు తీస్తూ రావడం మొదలుపెట్టగా వారిని అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులపై వారు రాళ్లు విసరడంతో పరిస్థితిని అదుపు చేయడానికి చర్యలు తీసుకున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తున్నది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని మూసివేసిన సమయంలో కూడా కొందరు భక్తులు ఆలయంలో అమ్మవారి దర్శనానికి రాబోయారు. అయితే మధ్యాహ్నం వరకు ఆలయాన్ని అధికారులు మూసివేసిన విషయం తెలుసుకుని వారు వెనుదిరిగిపోయారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చార్‌మినార్‌ సమీప ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసే సరికి పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఈ సంఘటన జరగడంతో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.