పాతాళంలోకి చేరిన భూగర్భ జలం

ఇంద్రవెళ్లి, న్యూస్‌లైన్‌: మండలంలోని గిరిజన గ్రామాల్లో భూగర్భ జలం పాతాలంలోకి చేరింది. దీంతో గిరిజన తాగుటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి వాల్గొండ గ్రామంలో 1200 మందికి పైగా జనాభా ఉంది. గ్రామ పొలిమేరలోని బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. భూగర్భజలం

అడుగంటడంతో నీరు కలుషితమవుతోంది.  ఎండ్లబండిపై డ్రమ్ములో నీరు తెచ్చుకుంటున్నారు. రెండు చేతిపంపులు ఉన్నా భూగర్భజలాలు అడుగంటడంతో పని చేయడం లేదు. ఖైర్‌గూడలో 25 ఆదివాసీ కుటుంబాలున్నాయి. గ్రామంలో ఉన్న బాయిలో నీరు అడుగంటింది.

దీంతో కిలోమీటరు దూరంలోని వ్యవసాయ బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారులకు విన్నవిచినా పట్టించుకోవడం లేదని  గ్రామ పటేల్‌ పేందోర్‌ జంగ్‌, మడవి రాములు ఆరోపించారు. వడగాం పంచాయితో పరిధి పాకిడిగూడలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. మంచినీటి పథకం బోరు చెడిపోవడంతో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఆరు నెలలుగా కలుషిత నీరు తాగాల్సి వస్తోందని ఆత్రం షేకు, ఆత్రం బారిక్‌రావు, మెస్రం భీంరావ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పొచ్చంపల్లి పంచాయతీ పరిధిలోని ఖాన్నపూర్‌లో 2007లో ఆర్‌డబ్ల్యూఎస్‌ నిధులు రూ. 10లక్షలతో మంచినీటి  ట్యాంక్‌ నిర్మించారు. ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. రెండు చేతిపంపులు చెడిపోవడంతో కలుషిత నీరే దిక్కవుతోంది.