పాత కక్షలతో ఒకరి దారుణ హత్య

ఏలూరు, జూలై 10 : ఒక హత్య కేసులో నిందితుడైన యువకుడిని, హతుడి స్నేహితుడు పాత కక్షలతో దారుణంగా హత్య చేసిన ఉదంతం మంగళవారం ఏలూరు పట్టణంలో చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. నగర సీఐ మురళీకృష్ణ వివరాలిలా ఉన్నాయి. హతుడు బొడ్డు గంగాధరరావు(38) రాణినగర్‌ నివాసి. ఇతను వెండర్‌ వ్యాపారం చేస్తూ ఫైనాన్స్‌ నడుపుతున్నాడు. ఇతను 2008లో ఏలూరులోని చేపలతూము సెంటర్‌లో నివసించే గంగోతు బాలకృష్ణ ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసు కోర్టు విచారణలో ఉన్నది. బాలకృష్ణ స్నేహితుడైన చిన్న కృష్ణ, పెద్ద కృష్ణ అప్పట్లో జరిగిన దాడి నుంచి తప్పించుకున్నారు. ఎప్పటికైనా తన మిత్రుడిని పొట్టన పెట్టుకున్న గంగాధరరావు హతమార్చాలని కక్షపెట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో స్థానిక తిలక్‌ నగర్‌ వద్ద మద్యం సేవించి గంగాధర్‌రావు ఇంటికి వస్తుండగా ఆయనపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గంగాధర్‌రావు అక్కడికక్కడే చనిపోయాడు. నగర సీఐ మురళీకృష్ణ నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగు చూశాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.