పాత పెన్షన్ విధానం కొనసాగించాలి
నిజామాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం రోడ్డున పడే ప్రమాదం ఉందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2004 తర్వాత ఎంపికైన ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ పథకంపై నమ్మకం గాని భద్రత గాని కలిగి లేనందున ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2004 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేస్తూ పాత పింఛన్ విధానాన్ని అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర స్థాయిలో ఉత్తరాల ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసి వచ్చేలా ఇదివరకే పలు ఉద్యమాలు చేపట్టామని, ఇపుడు ప్రధాని మోది, సీఎం కేసీఆర్‌లకు రాష్ట్రంలోని 34 శాఖలలో పనిచేస్తున్న 1.20 లక్షల ఉద్యోగులచే ఉత్తరాలు రాయించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. . నూతన పింఛన్ విధానం వల్ల ఇటీవల మరణించిన ఓ ఉద్యోగి కుటుంబానికి ఆసరా పింఛను కన్నా తక్కువగా రూ. 600 పింఛన్ రావడం చూస్తే ఆందోళనగా ఉందన్నారు.