పాదయాత్రలు కావవి..దండయాత్రలే
-వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం
-ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం
-కాంగ్రెస్ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం
హైద్రాబాద్, నవంబర్21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పార్టీల నేతలు చేస్తున్నవి పాదయాత్రలు కావని తెలంగాణ ప్రజలపై దండయాత్రలేనని జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు ఆయన బుధవారం కేసీఆర్‌ను కలిసారు. దాదాపు మూడు గంటలు భేటీ అనంతరం బయటికి వచ్చిన కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వారి మనోభావాలను గౌరవించకుండా సమైక్య పార్టీల నాయకులు తెలంగాణ లో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర పార్టీలవి పాదయాత్రలు కావని తెలంగాణ ప్రజలపై చేస్తున్న దండయాత్రలన్నారు. తెలంగాణపై తమ వైఖరి వెల్లడించకుండా తెలంగాణలో పర్యటిస్తున్నారని, వారిని ఎక్కడికక్కడే అడ్డుకోవాలని, తమ గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. జేఏసీలో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జేఏసీ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రోడ్ మ్యాప్‌ను వెల్లడిస్తామని తెలిపారు. జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండా, నిర్వహణ తేదీపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, సమకాలీన అంశాలపైనా చర్చించామని, స్పష్టమైన ఆలోచనలతో కార్యాచరణతో ముందుకు వెల్లాలని నిర్ణయించామన్నారు. ఈసారి ఉద్యమ కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీమాంధ్ర పార్టీలకు వ్యతిరేకంగా ఉధృతమైన కార్యక్రమాలతో సాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుత ఉద్యమం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రా పాలకుల పర్యటనలన్నీ నష్టం చేసేవేనని, ఇక్కడి ప్రజలపై ఆధిపత్యం చెలాయించేవేనన్నారు. సీమాంధ్ర ప్రాంత పెత్తందారుల పాదయాత్రలను తెలంగాణపై దండయాత్రలుగానే చూపిస్తామని చెప్పారు. ఇటువంటి పాదయాత్రల సమయంలో తెలంగాణ ప్రజలు తమకున్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట జేఏసీ భాగస్వామ్యపక్షాల నేతలు వి.శ్రీనివాస్ గౌడ్ కె.రఘు, కత్తి వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.