పాదయాత్రలో ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు
పెట్రో ధరలు, గ్యాస్ బాదుడు వంటి సమస్యలపై విశదీకరిస్తారా
నిరుద్యోగ సమస్యలపై మోడీ ఇచ్చిన హావిూలకు సమాధానం ఇవ్వగలరా
బిజెపి అధ్యక్షుడు బండి పాదయాత్రకు ముందు సమాధానాలు వెతుక్కోవాలి
హైదరాబాద్,ఆగస్ట్12(జనం సాక్షి): తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అన్ని పార్టీల్లో పాదయాత్రలకు సిద్దంగా సాగుతున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ నుంచి బయటపడ్డ ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో కేవలం ఉప ఎన్నికను దృష్టలో పెట్టుకుని పాదయాత్ర చేపట్టారు. అయితే ఆయన పాదయాత్రకు ఆరోగ్యం సమకరించకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయినా ఇప్పటికిప్పుడు పాదయాత్రనుఉ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈక్రమంలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఆయన కేవలం సిఎం కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇది ఎంతవరకు
ప్రతిఫలిస్తుందో చూడాలి. కేంద్రంలోని బిజెపి అద్భుతాలు చేసివుంటే బండి పాదయాత్రకు అనూహ్య మద్దతు దక్కేది.కానీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో పాటు, నిరుద్యోగ సమస్యలను పకక్కన పెట్టిన బిజెపి పాలనలో ఏం సాధించారని ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పగలిగే ధైర్యం బండికి ఉందా అన్నది ఆలోచన చేయాలి. కేవలం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకునే ఈ నాయకులు ప్రజల్లోకి వెళ్లేముందు ఏం చెప్పదల్చుకున్నారో స్పష్టం చేయాలి. అలాకాకుండా గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్లుగా వెళితే ప్రజల్లో అభాసు పాలు కాక తప్పదు. అయితే బండితో పాటు పలువురు ఇప్పటికే పాదయాత్రలు చేస్తామన్నారు. కాంగ్రెస ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి ప్రకటనే చేశారు.
ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు ఎవరికి వారు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.ఇలా చేపట్టే పాదయాత్రలకు సొంత పార్టీల్లోనే ఆదరణ కరువవడం, శ్రేణుల్లో ఆసక్తి లేకపోవడం.. చూస్తూనే ఉన్నాం. కరోనాతో ప్రజల్లో ఇపపటికే భయాల ఉన్నాయి. ఈ దశలో ప్రజలను గుంపులగా చేర్చే విధంగా యాత్రలుచేపట్టడం మంచిదేనా అన్నది కూడా ఆలోచించాలి. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని నాయకులు యాత్రలంటూ బయల్దేరితే దానికో పరమార్థం ఉండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల తెలంగాణకు లేదు ఎపికి ఒనగూరిన ప్రయోజనాలు శూన్యం. లక్ష్యం రాజకీయాధికారమైనప్పుడు ప్రజల సమస్యలపై ఏమైనా మాట్లాడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది స్వలాభం కోసం కకావచ్చు…తమ స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం కావచ్చు..చేస్తున్నట్లు చెబుతున్న యాత్రల వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలేంటో వివరించాలి. తెలంగాణలో ఏ అంశాల ప్రాతిపదికన పాదయాత్రల ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయనేది ఆ పార్టీలు, నేతలే చెప్పాలి. పాలకపక్షాన్ని నిలదీయడానికి స్పష్టమైన అంశాల్లేని పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుల తీరు ప్రజలను ఆకట్టుకుంటుందా అన్నది కూడా ముఖ్యం. కరోనా నేపథ్యంలో, క్లిష్ట పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర స్థూల ఉత్పత్తి మొదలుకొని, తలసరి ఆదాయం వరకు అన్ని సూచీలు జాతీయ సగటులను మించి ఉన్నాయి. ఈ విషయాలు పార్లమెంటు సాక్షిగా నిర్దారితమవుతున్నాయి వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల రంగం, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ ఎగుమతులు, నూతన పెట్టుబడుల ఆకర్షణ, నూతన ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమం, వెనుకబడిన, మైనారిటీ వర్గాల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం, రైతు సంక్షేమం, ఆరోగ్య రంగంలో వసతుల కల్పన, పర్యావరణం, పల్లెల పట్టణాల ప్రగతి తదితర అంశాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేయడానికి యాత్రలను చేసి, వాటిని ప్రభుత్వానికి నివేదించేందుకు అయితే మంచిదే. ఏదో ఒక సామాజిక అంశంపై, ఒక ప్రాజెక్టు సాధనకో లేదా హక్కుల పరిరక్షణ కోసమో పాదయాత్రలు చేసినా మంచిదే. కేసీఆర్‌ను విమర్శించడం కోసమే అయితే ఫర్వాలేదు. కానీ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే బిజెపి ఏం చేస్తున్నదో బండి తన పాదయాత్ర ద్వారా ప్రజలను మెప్పించగలగాలి.