పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి

 

 

సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు

అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు

అనంతపురం,నవంబర్‌16(జనంసాక్షి):

సామాజిక ఉద్యమకారిణి, నోబెల్‌ అవార్డు గ్రహీత, మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. పాపసానిపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె భేటీ కానున్నారు. సూకీతోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌, పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మడకశిర మండలంలోని పాపసానిపల్లి గ్రామం  ముస్తాబవుతోంది.  కలెక్టర్‌ దుర్గాదాస్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ జరిగిన అభివృద్దిని ఆమె ప్రత్యక్షంగా వీక్షిస్తారు. గ్రామంలో సూకీ మహిళా సంఘాల సభ్యులతో నిర్వహిస్తున్న సమావేశానికి వేదికయిన ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులు పనులను చకచక చేయిస్తున్నారు. పాఠశాలలోని గదులన్నిటికీ కొత్తగా రంగులు వేయిస్తున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించి రోడ్డు పనులను చేపట్టారు. ఏజేసీ చెన్నకేశవరావు, పెనుకొండ ఆర్డీవో ఈశ్వర్‌లు గ్రామంలోనే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామానికి సూకీ వస్తున్న నేపథ్యంలో గ్రామం మొత్తాన్ని శుభ్రంచేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమయింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీరాజ్‌, ఎంపీడీవో, తహసిల్దార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, తదితర అన్ని శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు వారి వారి శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో పూర్తిగా తలమునకలవుతున్నారు. ప్రధాన అతిధి సూకీ రాక కోసం యావత్‌ గ్రామం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ఇదిలావుంటే సూకీకి స్థానికులు రాయలసీమ రుచులు చూపించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. గ్రామంలోని అందరూ గ్రామాన్ని సూకి రాక కోసం ముస్తాబు చేస్తున్నారు. తోరణాలతో, రంగోళీలతో గ్రామాన్ని అలంకరంగా తీర్చిదిద్దుతున్నారు.పాపసానిపల్లి అనంతపురం జిల్లాలోని కర్నాటక-ఆంధప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో 16 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామం అదర్శ గ్రామంగా నిలిచింది. దీంతో దీన్ని సందర్శించేందుకు సూకీ వస్తున్నారు. జిల్లా అధికాలులు మాట్లాడుతూ.. తాము సూకీకి రాయలసీమ తీపి పదార్థాలు రుచి చూపిస్తామని చెబుతున్నారు. కజ్జికాయలు, రవ్వ లడ్డు, అత్తి రసాలు, కొడుబాలే, రాగి, జొన్న, సబ్జి రోటీ- తదితరాలను ఆమెకు ఆఫర్‌ చేస్తామని చెబుతున్నారు.డిఆర్‌డిఏ అధికారులు ధర్మవరం సిల్క్‌ బట్టలను బహూకరించనున్నట్లు చెప్పారు. సూకీతో పాటు- ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌, పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. దీంతో సూకీతో పాటు- మిగిలి వారికీ ఆహ్వాన బ్యానర్లు వెలుస్తున్నాయి. స్థానిక పాఠశాలను అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. గదులకు కొత్త రంగులు వేస్తున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించి రోడ్డు పనులు చేపట్టారు.సూకీ వస్తున్న నేపథ్యంలో గ్రామాన్ని శుభ్రం చేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమయింది. ఆయా శాఖల అధికారులు అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా సూకి బెంగళూరు విూదుగా ఉదయం 9.20 నిమిషాలకు పాపసానిపల్లికి రానున్నారు. పాపసానిపల్లి బెంగళూరుకు 110 కిలోవిూటర్ల దూరంలో

ఉంది.