పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్‌ చర్చలు సఫలం

4

హైదరాబాద్‌ ఆగస్ట్‌13(జనంసాక్షి):

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మిక సంఘాల జేఏసీతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో, సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నుంచి స్పష్టమైన హావిూ లభించిందని జేఏసీ నేతలు చెప్పారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. కమిటీకి పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌ పీటర్‌ నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌, ఆర్థిక శాఖ నుంచి ఒక ఉన్నతాధికారి, న్యాయశాఖ నుంచి ఒక అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారని మంత్రి వివరించారు. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినమని చెప్పారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం, ఆర్థిక పరిపుష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో భాగంగానే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్య ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. పంచాయతీరాజ్‌ రంగంలో కూడా రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. పంచాయతీల్లో పన్ను వసూళ్లలో రాష్ట్రం ఆదర్శంగా ఉందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆదర్శంగా నిలుస్తామని కేటీఆర్‌ అన్నారు.