పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని భిక్షాటన
నిజామాబాద్,మే3(జనం సాక్షి): ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 3నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి , మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 3 నెలలు,సెక్యూరిటీ సిబ్బందికి 4 నెలల వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వెంటనే అధికారులు కార్మికులకు పెండింగులో పెట్టిన వేతనాలను చెల్లించడంతో పాటు సంవత్సరానికి 8 జాతీయ పండగ సెలువులే కాకుండా 20 రోజుల పనికి 1 రోజు ఆర్జిత సెలవును ప్రవేశపెట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించడంతో పాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హైమది, ఉపాధ్యక్షురాలు కవిత, నాయకులు లింగం , అనురాధ, కాళీ ప్రసాద్, ఆసుపత్రి, మెడికల్ కళాశాలల కార్మికులు పాల్గొన్నారు.