పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండి

ప్రజలకు పిలుపునిచ్చిన బాలకృష్ణ
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబేనని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. నగరంలోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని శనివారంనాడు ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, సామాన్య కార్యకర్తగానే సేవలందిస్తానని చెప్పారు. బహుశా.. వచ్చే మహానాడు వేదికగా తన రాజకీయ ప్రవేశం జరగవచ్చని తెలిపారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు కాదని చెప్పారు. తాను ఎటువంటి పదవిని చంద్రబాబును కోరలేదన్నారు. పార్టీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీలో నాయకత్వ మార్పు అవసరం లేదని కరాఖండిగా చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పార్టీని వదిలి వెళ్లేవారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారిని ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. తన అభిమానులు తన వెంటే ఉన్నారన్నారు. వారందరూ కూడా పార్టీని మరింత బలపర్చేందుకు అవసరమైతే సేవలు అందిస్తారని తెలిపారు. తన అభిమానులను తన నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు. లోకేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి చేరే విషయం వారి వారి సమయానుకూలతపై ఆధారపడి ఉంటుందన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల్లో బిజీగా ఉన్నాడన్నారు. కుటుంబ సభ్యులందరం కలిసే ఉన్నామన్నారు. మీడియానే లేనిపోని కథనాలను వెలువరిస్తుందన్నారు. తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవన్నారు. తాను ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉన్నానని, బసవతారకం ఆసుపత్రికి చైర్మన్‌గా ఉన్నానని, ఇంకా ఎన్నో సేవలు ప్రజలకు అందిస్తునే ఉన్నానని చెప్పారు. అలాగే నిర్ణీత సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.