పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం
` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భారాస, భాజపా నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని భారాస నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్‌ పిటిషన్‌ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి హైకోర్టు విచారించగా.. సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఇదిలాఉంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్టాల్లోన్రి న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.  పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. స్పీకర్‌ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.
తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం:కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ హై కోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్‌ వేసింది.  తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారాస సానుకూలంగా స్పందించింది. ఈ తీర్పుతో ఇక ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొంది. ఈ సందర్భంగా  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్‌ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.
నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖామన్నారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి శిక్ష తప్పదని కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ తప్పకుండా గెలుస్తుందన్నారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసన సభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.

తాజావార్తలు