పార్లమెంటులో అట్టుడుకిన లలిత్‌ మోదీ వ్యవహారం

3

– అపరకాలికగా సోనియా

– వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు

– సుష్మాకు 12 కోట్ల ముడుపులు : రాహుల్‌

న్యూదిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి):

ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ కూడా లోక్‌ సభ వెల్‌ లోకి దూసుకు వెళ్లారు. లలిత్‌ మోడీ కుంభకోణంపై చర్చలో భాగంగా ఆమె తొలిసారిగా వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ బయట సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించిన సోనియా ఇప్పుడు సభలోపలా ముందు నిలబడ్డారు.   అపరకాళికలా ఆమే నినదించారు.

కాంగ్రెస్‌  పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఘాటుగా మాట్లాడుతున్న సందర్బంలో బిజెపి,కాంగ్రెస్‌ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే పేరును ఖర్గే ప్రస్తావించగా స్పీకర్‌ సుమిత్ర అభ్యంతరం చెప్పారు. దాంతో కాంగ్రెస్‌,బిజెపి సభ్యులు పరస్పరం వాదులాడుకున్నారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారని స్పీకర్‌ ప్రశ్నించారు. ఈ తరుణంలో బిజెపి రన్నింగ్‌ కామెంటరీని నిరసిస్తూ సోనియాగాంధీతో సహా కాంగ్రెస్‌ ఎంపిలంతా వెల్‌ లోకి దూసుకు వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. ఖర్గే ఉపన్యాసానికి అధికార పక్ష సభ్యులు అడ్డుపడే ప్రయత్నం చేశారు. లలిత్‌మోదీని రక్షించి ఎంత మూటగట్టుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. లలిత్‌మోదీ అంశంపై లోక్‌సభలో నిర్వహించిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌, కేందప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. లలిత్‌ మోదీని రక్షించినందుకు సుష్మా స్వరాజ్‌కు రూ.12 కోట్లు ముట్టాయని ఆయన ఆరోపించారు. లలిత్‌ మోదీకి, సుష్మాకు వ్యాపార సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానికి చెప్పే లలిత్‌ మోదీకి సాయం చేశారా? అని ప్రశ్నించారు. మానవతావాద సాయాలు రహస్యంగా ఎందుకు చేయాలి? అని సుష్మాను రాహుల్‌ ప్రశ్నించారు. వీటన్నింటికీ ప్రధాని మోదీనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లధనానికి లలిత్‌మోదీ చిహ్నం లాంటి వాడని అన్నారు. సుష్మాస్వరాజ్‌ మంగళవారం పార్లమెంటులో తన చేయి పట్టుకుని నేనేమైనా తప్పు చేశానా అని అడిగారని తెలిపారు. సభలో తమ ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం ప్రధానమంత్రి మోదీకి లేదని.. అందుకే సభకు రావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. లలిత్‌మోదీకి రహస్యంగా ఎందుకు సాయం చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుష్మాస్వరాజ్‌ ను ఆయన డిమాండ్‌ చేశారు. సుష్మాస్వరాజ్‌ విమర్శలను రాహుల్‌ తిప్పికొట్టారు. నల్లధనం వెనక్కి తెస్తామని ఎన్నికల ముందు ప్రధాని హావిూ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నల్లధనంపై చర్చలో పాల్గొనడానికి మోడీకి ధైర్యం లేకుండా పోయిందని మండిపడ్డారు.

లోక్‌సభలో రాహుల్‌ శివాలెత్తిపోయి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. లలిత్‌ మోదీ అభ్యర్థన పత్రాన్ని సుష్మా చూపించగలరా? అని రాహుల్‌ లోకసభలో సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు వద్దని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ వారించినా రాహుల్‌ వినలేదు. ఐపీఎల్‌ అనేదే బ్లాక్‌మనీకి కేంద్రంలా మారిపోయిందని మండిపడ్డారు. లలిత్‌ మోదీ బ్లాక్‌మనీ రాకెట్‌కు రింగ్‌ లీడర్‌ని రాహుల్‌ వ్యాఖ్యానించారు.  మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో మాట్లాడటం కాదు, వీటి గురించి మాట్లాడండని రాహుల్‌గాంధీ మోదీకి చురకలంటించారు.

పార్లమెంట్‌ ఉభయ సభల్లో లలిత్‌గేట్‌  తదితర వ్యవహారాలు బుధవారం తీవ్ర దుమారం రేపాయి. లలిత్‌ మోడీకి సుష్మా సహకారంపై విపక్షనేత మల్లికార్జన ఖర్గే తీవ్రంగా దుయ్యబట్టారు. వాదప్రతివాదాల మధ్య సుస్మ సమాధానం ఇస్తూ తాను కాంగ్రెస్‌ వారిలాగా ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడలేదన్నారు. తొలుత లోక్‌సభలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ… లలిత్‌ మోదీ అంశంపై చర్చకు సిద్దమని ఎంత సమయం కావాలన్నా… ఎంతమంది మాట్లాడాలన్నా అనుమతించాలని కోరారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఏ రూపంలో చర్చకైనా అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తామ కూడా సమాధానం చెప్పే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతిస్తామన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ప్రధానమంత్రి సభకు రావాలని, ప్రశ్నోత్తరాలు రద్దు చేసి లలిత్‌మోదీ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. నిర్ణయం విూరు తీసుకోండి… ఏరకమైన చర్చకైనా తాము సిద్ధమని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సభా సంప్రదాయాలు, నిబంధనల ప్రకారం చర్చ చేపడతామని వివరించారు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించడం సంప్రదాయమని కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సజావుగా సాగనీయాలని, ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయడం కుదరదని వెల్లడించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… లలిత్‌మోదీ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో సావధానంగా చర్చ చేపడదామని విపక్ష సభ్యులకు సూచించారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం చర్చను ప్రాంభించిన కాంగ్రెస్‌ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ లలిత్‌మోదీ ఆర్థిక నేరస్తుడని అన్నారు.  మనీ లాండరింగ్‌ కేసులో లలిత్‌మోదీ ఐటీ శాఖ ఎదుట  విచారణకు హాజరు కాలేదని.. అందువల్లే ఆయన వీసాను సీజ్‌ చేసినట్లు చెప్పారు. లలిత్‌ మోదీకి వ్యతిరేకంగా గత ఆర్థికమంత్రి ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. అలాంటి నేరస్తుడికి సుష్మాస్వరాజ్‌ ఎలా సహాయం చేశారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు వచ్చి తమ వాదన విని సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. మోదీ టీవీ, రేడియో, సభల్లో ప్రసంగిస్తారు తప్ప లోక్‌సభలో మాట్లాడరని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై చర్చకు ముందే అనుమతి ఇచ్చి ఉంటే ఇంత సమయం వృథా అయ్యేది కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రి ¬దాలో ఉన్న సుష్మాస్వరాజ్‌ లలిత్‌ మోదీకి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందని ఖర్గే డిమాండ్‌ చేశారు. సుష్మాస్వరాజ్‌ చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం ఎందుకు అంగీకరించట్లేదని ప్రశ్నించారు. లిలిత్‌ మోదీపై చర్యలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఎందుకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. లలిత్‌ మోదీకి మానవతా దృక్పథంతో సాయం చేయాలనుకుంటే ఆయన్ని భారత్‌కు ఎందుకు రప్చించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలన్న చట్టానికి లోబడే ఉండాలన్న నియమాన్ని సుష్మా పాటించలేదన్నారు. ఈ అంశంపై లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఖర్గే అభిప్రాయ పడ్డారు. లలిత్‌మోదీకి సాయం చేసినట్టు సుష్మానే ఒప్పుకున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. లలిత్‌మోదీపై ఇంటర్‌పోల్‌, రెడ్‌ కార్నర్‌ నోటీసు ఉన్పప్పటికీ సుష్మా సహకరించారని తెలిపారు. ఓ ఆర్థిక నేరస్తుడికి సుష్మా స్వరాజ్‌ సాయం చేశారని ఆయన ఆరోపించారు. లలిత్‌మోదీ లాయర్లు సుష్మా కుటుంబసభ్యులే అని అన్నారు. సుష్మా సాయం చేయాలకునుంటే చట్టం పరిధిలో చేయాల్సిందని, విదేశాంగశాఖ అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగిందని ఆరోపించారు.  లలిత్‌కు ప్రభుత్వం అండగా ఉందా అని నిలదీశారు. లిత్‌కు సాయం చేసినట్లు సుస్మా ఒప్పుకున్నందునే ఆమె రాజీనామా కోరుతున్నామని చెప్పారు. మానవతా దృక్పథంతో సాయమన్న వాదన సరికాదని మల్లికార్జున ఖర్గే అన్నారు.   తాము రూల్‌ 53 కింద చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తే.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్షన్‌ 193 కింద చర్చకు అనుమతించారని ఆరోపించారు. ఈ దశలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం కొద్దిసేపు లోక్‌సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం లోక్‌సభ ప్రారంభమయ్యాక  ఖర్గే చర్చను కొనసాగించారు. లలిత్‌మోదీ, దుష్యంత్‌ మధ్య ప్రైవేటు వ్యక్తుల లావాదేవీలు జరిగాయని జైట్లీ చెప్పారని అన్నారు. పది రూపాయల షేరును 96 వేలకు ఎవరైనా తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాడికి సాయం చేసినందుకు సుష్మా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ సమాధానం చెప్పేందుకు యత్నించగా కాంగ్రెస్‌ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ సభ్యులపై సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం వినాలని అనుకోకపోతే బయటికి వెళ్లవచ్చంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్‌ పక్ష నేత ఖర్గే సమాధానం కూడా వినాలంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.

పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు

పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు మిన్నంటడంతో వాయిదా పడ్డాయి. ఈ ఉదయం లోక్‌సభలో సుష్మా వ్యవహారంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. దీంతో ఈ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. లలిత్‌గేట్‌ వ్యవహారంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సుష్మా సభలో ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పీకర్‌ నచ్చజెప్పినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఈ వ్యవహారంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు రాజీనామా చేయాలని పట్టుబట్టారు. చైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో చైర్మన్‌ హవిూద్‌ అన్సారీ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.లలిత్‌ మోదీ వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని.. నిజానిజాలు ప్రజలకు కూడా తెలియాలని వెంకయ్యనాయుడు తెలిపారు. దీనికి స్పందించిన కాంగ్రెస్‌ నేత ప్రధాని లేకుండా చర్చకు కాంగ్రెస్‌ ఒప్పుకోదని,ప్రధాని సభలో లేకుండా సభ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. అయితే ప్రధాని లేకుండా చర్చకు ఒప్పుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై ప్రధాని తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు.  సుష్మా స్వరాజ్‌ రాజీనామాకు

పట్టుబడుతూ నిరసనలను కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. వాయిదా తీర్మానాలను అనుమతిస్తేనే చర్చకు అంగీకరిస్తామని అన్నారు. నేరస్తుడికి సుష్మాస్వరాజ్‌ ఎలా సహాయం చేశారని ప్రశ్నించారు.  చర్చ ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరా రాజే పేరును ప్రస్తావించారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం మంచిది కాదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారపక్ష ఎంపీలు కూడా ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఒక రాష్ట్ర సీఎం పేరును పార్లమెంట్‌లో ఎలా ప్రస్తావిస్తారని బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభలో అధికార విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. కళంకిత మంత్రుల రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ రాజ్యసభలో  చైర్మన్‌ వెల్‌ వద్ద విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను వాయిదా వేశారు.