పార్లమెంట్‌లో తక్షణం ‘బిల్లు’ పెట్టాలి
ఆదిలాబాద్, డిసెంబర్ 11 తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మూడు రోజుల పోరుదీక్షల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన పోరుదీక్షలో రాజకీయ ఐకాస నేతలు, విద్యార్థి సంఘాలు సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ఒక బిజెపితో సాధ్యమని వారు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఎన్నో బిల్లులను ఆమోదింపజేసుకుంటున్న కేంద్రం తెలంగాణ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల్లో చలనం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైన రాష్ట్ర సాధనకు పార్టీలన్ని కలిసి రాకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.