పార్లమెంట్‌లో పెట్రోమంటలు
పెంచిన ధరల ఉపసంహరణకు విపక్షాల డిమాండ్
పలుమార్లు ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి):
పెట్రో ధరల పెంపుపై సోమవారం పార్లమెంట్ అట్టుడికింది. విపక్షాలు ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. తక్షణమే పెట్రో ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే ఆందోళనకు దిగాయి. దీంతో సభాకార్యలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రభుత్వంపై దాడికి దిగాయి. పెట్రోలు ధరల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ధరల పెంపుపై ప్రభత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ విూరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం అదే పరిస్థితి పునరావృతమైంది. పెట్రో ధరలను ఉపసంహరించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో సభ మళ్లీ వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే ఎన్డీయే పక్షాలతో పాటు వామపక్షాలు, బీఎస్పీ, ఏజీపీ తదితర పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు. బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం పార్లమెంట్‌ను అవమానించిందని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో పెట్రోల్ ధరల పెంపు ప్రకటన సభలో చేయకుండా పెంచేయడం వల్ల పార్లమెంట్‌ను అవమానించిందని విమర్శించారు. ప్రభుత్వం పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించాలని భావిస్తోందా? అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇది విూ గౌరవానికే భంగంకరం. పార్లమెంట్‌ను అవహేళన చేయడమే’నని చైర్మన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్పీ కూడా బీజేపీకి మద్దతుగా నిలిచింది. కీలక విధాన నిర్ణయాలు సభలో ప్రకటించకుండా ఎలా అమలు చేస్తారని ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే.. విధాన నిర్ణయాలను సభలో కాకుండా బయట ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ప్రభుత్వం సభ గౌరవానికి భంగం కలిగించిందని మండిపడ్డారు. అయితే, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కల్పించుకుంటూ.. పెట్రో ధరల పెంపు చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.