పార్లమెంట్‌ వేదికగా వ్యవసాయంపై చర్చ చేయాలి !

ప్రభుత్వ హావిూతో వెనుదిరిగిన రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇక మోడీ ప్రభుత్వానిదే. ఇంత కాలం అంటే ఏడాదిగా వారు ఆందోళన చేయడంతో సాగుచట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం తక్షణం ఇక మద్దతు ధరలపై ప్రకటన చేయాలి. అలాగే దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోల్లపై ఏటా ప్రతిష్టంభన రాకుండా చూడాలి. ఏపంటులు వేయాలో..ఏ  పంటలు అవసరమే ఇదే పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాలి. విపక్షాల ను విశ్వాసంలోరకి తీసుకుని కేవలం రైతుల సమస్యలపైనే చర్చించి ఓ జాతీయ విధానానికి రూపూకల్పన చేయాలి. దేశంలో 60శాతం పైగా ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు..దేశంలో ఇంకా ఆహర కొరత రాకుండా..వంటనూనెలు దిగుమతి చేసుకోకుండా..పప్పులను దిగుమతి చేసుకోకుండా ఓ విధానం ప్రకటించాలి. అన్నదాతలు ఏ పంటలు వేయాలో వ్యవసాయ రంగం నిర్దేశం చేసేలా రాష్టాల్రతో కలసి సమిష్టి బాధ్యతను తీసుకోవాలి. రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసే వారు మంచివారు కాకపోతే అది చెడ్డ రాజ్యాంగంగా మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చివరి రాజ్యాంగ సభ సమావేశంలో భవిష్యత్తు పాలకులకు హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో అంబేడ్కర్‌ను గుర్తు చేసుకుంటూ అన్నదాతలను ఆదుకోవాలి. పదవుల్లో తాము ఉండేది శాశ్వతం కాదని కూడా గుర్తిం చాలి. లేకుంటే వారి పోరుబాట రేపటి ఉద్యమానికి లేదా ప్రజావ్యతిరేక  ఉద్యమాలకు నాంది కాగలదని గుర్తించాలి. చట్టాలు ఎంతమేరకు వారికి ఉపయోగపడతాయో అన్న ధ్యాస  లేకుండా మోడీ ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు అన్నది ముమ్మాటికీ రైతుల సంఘటిత శక్తికి నిదర్శనంగా చూడాలి. అయితే ఇదే సందర్భంలో గత ఏడాదిగా పదుల సంఖ్యలో రైతులు ఈ ఉద్యమంలో అసువులు బాసారు. లఖీంపూర్‌ ఘటనలో ఐదారు గురు హత్య కావింపబడ్డారు. ఎన్నో రకాల నష్టాలు జరిగాయి. వీటన్నికటీ మోడీనే బాధ్యుడు. బిజెపి ముసుగులో తన నిరంకుశ విధానాలతో దేశాన్ని అధోగతి పాల్జేసిన పాలకుడిగా మోడీ ప్రజల ముందు ఇప్పుడు దోషిగా నిలబడ్డారు. ఈ మచ్చ నుంచి బయట పడేందుకు ఇదే మంచి తరుణం. అందువల్ల ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే దేశం యావత్తూ ఆశ్చర్య పోయేలా..వ్యవసాయం చేసే రైతులు ధీమాగా ఉండేలా..చరిత్ర సృష్టించేలా వ్యవసాయ విధానం తసీఉకుని రావాలి. దీనికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చయినా వెనకాడరాదు. అవసరం అయితే అందుకు నిపుణుల సాయం కూడా తీసుకోవాలి. ఇదే క్రమంలో పెట్రో ధరలు, ప్రబుత్వరంగ సంస్థల అమ్మకాలపైనా తగిన నిర్నయం తీసుకోవాలి. ఇప్పటికే కరోనా కష్టాలతో దేశం యావత్తూ అధోగతి పాలయ్యింది. పేద, సామాన్య ప్రజల బతులకు ఛిత్రం అయ్యాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజల కోణంలో నిర్ణయాలు ఉండాలి.  ఎందుకంటే సాగుచట్టాల్లో కేవలం రైతులు మాత్రమే విజయం సాధించారు. రాజకీయ పార్టీలు అండగా నిలిచినా, పార్లమెంటులో పోరాడినా ఫలితం దక్కలేదు. కానీ ఏడాదికి పైగా వారు చేస్తున్న ఆందోళన లేదా ఉద్యమం కారణంగా మోడీ దిగివచ్చి సాగుచట్టాలను వెరనక్కి తీసుకోక తప్పలేదు. అందుకే ప్రజాగ్రహానికి తలొగ్గి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ..  దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలి. విశాఖ స్టీల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టకుండా దేశ ఆస్తిగా గుర్తించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెంచాలి. అప్పుడే మోడీ తన చిత్తశుద్దిని చాటుకోగలరు. సాగు చట్టాల కారణంగా ప్రాణాలు కలోప్పోయిన వారికి ప్రధాని ఏం సమాధానం చెబుతారన్నది కూడా ముఖ్యమే. సాగుచట్టాల ఉద్యమంలో ఎవరు కూడా మరణించ లేదనడం సరికాదు. కేంద్రమంత్రి తోమర్‌ పదేపదే ఇదే సమాధానం చెప్పడం ద్వారా సమస్యను మరింత జటిలం చేయొద్దు. అధికారంలో ఉన్నది మన ప్రజలను బాగు చేయడానికే అన్న ధ్యాసతో ముందుకు సాగితే సమస్యలు రావు. జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారన్నది కూడా ముఖ్యమే. ఇప్పటికే నోట్ల రద్దు మొదలు జిఎస్టీ, సాగుచట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు, కార్పోరేట్లకు ఊడిగం, కరోనా కష్టాల్లో ఆర్థిక మందగమనం వంటి అనేకా నేక చర్యల కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. బిజెపిలో తన మాటకు ఎదురులేకుండా చేసుకున్న మోడీ నిర్ణయాల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడి పోతున్నారు. అయినా ఇవేవీ ఆయన పెద్దగా పట్టించు కోవడం లేదు. చాయ్‌వాలాను అంటూ ప్రజలను నమ్మించి గొంతు కోసిన నేతగా ప్రజల ముందు నిలిచారు. ఇలాంటి పాలకులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మనగుడ సాగించ లేదు. బిజెపికి ఉన్న మంచి అనే ముసుగును వేసుకున్న నియంతగా మోడీ అవతరించారు. కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ఏమాత్రం ప్రదర్శించలేదు. సరికదా ఆందోళన చేస్తున్న అన్నదాతల గురించి పట్టించుకోలేదు. కనీసం వారి మాటలకు విలువ ఇవ్వలేదు. కార్పేరేట్‌ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించాలన్న లక్ష్యం తప్ప ఎక్కడా రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడ లేదు. వ్యవసాయాన్ని పండగచేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్న మాటలు సాగుచట్టాలతో బూటకమని తేలిపోయింది. ప్రజల ఉద్యమంలో కొట్టుకుపోతామన్న భయంతోనే వాటిని ఇప్పుడు రద్దు చేశారని భావించాలి. తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు తప్ప మరోటి కాదు. సాగుచట్టాలు  రైతుల భవిష్యత్‌ను అంధకారంలో పడ వేస్తాయని, కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలపై వారు ఆధారపడే పరిస్థితి కల్పిస్తాయని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరించినా పట్టించు కోలేదు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి నిజంగా వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని భావించి ఇప్పటికైనా  విస్తృతంగా చర్చించాలి. అప్పుడే మోడీ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. లేకుంటే చరిత్రలో కలసి పోతారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై చర్చించాలి. అప్పుడే దేశానికి హితం చేకూరగలదు.