పాలనలో కేసీఆర్ నెం.1
– మోదీ సర్వే వెల్లడి
హైదరాబాద్,జులై 13(జనంసాక్షి):కేసీఆర్ దూసుకెళ్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిస్తున్నారు. భారత దేశ ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధాని మోదీ నిర్వహించిన రహస్య సర్వేలో తెలంగాణ రథసారథి కేసీఆరే టాప్ అని తేలింది. అన్ని రాష్ట్రాల పనితీరును ప్రధాని మోదీ ఇటీవల సవిూక్షించారు. రాష్ట్రాల అభివృద్ధికి ఆయా సీఎంలు చేస్తున్న కృషిని ఆయన బేరేజీ వేశారు. ఆ లెక్కల్లో మన కేసీఆర్ టాప్ గేర్‌లో వెళ్తున్నారు.వివిధ పథకాలతో నవ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ దేశంలోనే ఉత్తమ సీఎంగా నిలిచినట్లు సర్వే స్పష్టం చేసింది. ప్రజాసంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్న కేసీఆర్ సూపర్ సీఎంగా ముందుకెళ్తున్నారు.దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలితప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్‌వన్‌గా నిలిచారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ రెండో స్థానంలో, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మూడోస్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ నాలుగోస్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోస్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు తెప్పించుకుంటున్నారు. మోడీ నిర్వహించిన సర్వేలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రథమస్థానంలో నిలిచారు. కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్‌తో పాటు ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. ప్రజలను మెప్పించడంలో, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, ప్రజాభిమానం చూరగొనడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్నారని సర్వేలో తేల్చారు. ఈ ఫలితాలు అధికారికంగా ఈ నెల 16న ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్యమంత్రులు వసుంధరరాజే సింధియాకు 7వ స్థానం, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌ప్రసాద్‌కు 14వస్థానం లభించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు 13 స్థానం లభించింది.