పాస్‌వర్డ్‌లు మార్చుకోండి

– వినియోగదారులకు సూచించిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌
శాన్‌ఫ్రాన్సిస్‌కో, మే4(జ‌నం సాక్షి ) : వినియోగదారులంతా తమ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ కోరింది. కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో ఉన్నట్టుండి సమస్య తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ జరిగిందా?, మరేదైనా సమాచార దుర్వినియోగం జరిగిందా? అనే అంశంపై విచారణ చేసింది. అయితే అంతర్గత దర్యాప్తులో పాస్‌వర్డ్‌ల చోరీ జరిగినట్లు గానీ, దుర్వినియోగం జరిగినట్లు గానీ ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించింది. దాదాపు 330 మిలియన్‌ మంది వినియోగదారులు తమ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరింది.
ఇటీవల ట్విటర్‌లో తలెత్తిన సమస్య ఎన్ని పాస్‌వర్డ్‌లపై ప్రభావం చూపిందనే విషయాన్ని ట్విటర్‌ వెల్లడించలేదు. అయితే దీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఆ సంఖ్య చాలా పెద్దదని చెప్పుకొచ్చారు. కొన్ని వారాల క్రితం ట్విటర్‌ ‘బగ్‌’ను కనిపెట్టింది. ఆ బగ్‌ ఇంటర్నల్‌ లాగ్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేస్తోందని గుర్తించామని వెల్లడించింది. అయితే బగ్‌ను ఫిక్స్‌ చేశామని, ఇక విూదట పాస్‌వర్డ్‌ల దుర్వినియోగంపై ఎలాంటి సమస్య ఉండదని స్పష్టంచేసింది. ముందు జాగ్రత్త చర్యగా అందరూ పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని సూచించారు. ఇదే పాస్‌వర్డ్‌ ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో అక్కడ కూడా పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరింది. ట్విటర్‌లో తలెత్తిన ఈ సమస్య పట్ల క్షమాపణలు కోరింది. వినియోగదారుల ఖాతాలు భద్రంగా ఉండేందుకు పాస్‌వర్డ్‌ మార్చుకోవడం సహా పలు జాగ్రత్తలు సూచించింది.