పిసిసి అధ్యక్షునిగా ‘బొత్స’ విఫలం

14నెలలుగా కానరాని ముద్ర
హైదరాబాద్‌, ఆగస్టు 4 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా దాదాపు 14నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర రవాణ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ వ్యవహారాలను నడిపించడంలో పూర్తిగా విఫలమైయ్యారు. అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి సారించి అతి తెలివిగా వ్యవహరించడం అనుకొని విధంగా బెడిసి కొట్టింది. ఫలితంగా ఆయన ఇటు మంత్రిగాను, అటు పిసిసి అధ్యక్షునిగా విఫలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో సొంత కార్యవర్గాలని ఏర్పాటు చేసుకోలేకపోయిన బొత్స, జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటులో కూడా చేతులెత్తేశారు. రెండేళ్ళకు పైగా ఇంఛార్జ్‌ పాలనలో నడుస్తున్న సొంత విజయనగరం జిల్లాలోనే ఆయన పూర్తి స్థాయి అధ్యక్షుని నియమించలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, ఇంఛార్జ్‌ డిసిసి అధ్యక్షునిగానే కొనసాగుతున్నారు. మరో వైపు ఇదే జిల్లాకు చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే తమ పార్వతీపురానికి చెందిన జయమణి కూడా ఆ పార్టీవైపే మొగ్గుచూపారు. ఇంకా వీరి బాటలో సాలూరు ఎమ్మెల్యే, రాజన్న దోర కూడా నడుస్తున్నారు. అయినప్పటికి గడచిన ఎన్నికల్లో నాలుగు పదవులను తన ఇంట్లోకి తెచ్చుకున్న బొత్స ఆ తరువాత సమీప బంధువు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పాలనాయుడు సైతం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవైపు దృష్టి సారంచడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై పట్టు సాధించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికి అనుకోని విధంగా మధ్యం ముడుపుల వ్యవహారం బొత్స ఫేక్‌కు చుట్టుకుంది. విజయనగరం జిల్లాలో ఎంఆర్‌పి రేట్ల అమలు, ఎసిబి అధికారులపై ఒత్తిడి వంటి విషయాల నేపథ్యంలో బొత్స అనుకోని నిజాలను బయటపెట్టి తప్పటడుగు వేశారు.ఆ జిల్లాలో 33షాపులు తమవేనంటూ ప్రకటించిన ఆయన తర్వాత మాట మార్చినప్పటికి పరిస్థితి చేదాటింది. ఫలితంగా కోట్లాదిరూపాయల ఆదాయాన్ని తెచ్చే మధ్యం సిండికేట్‌ తన తమ్ముడు ఆదిబాబు చేతినుంచి జారిపోయింది. సుమారు 8కోట్ల రూపాయల వరకు మధ్యం వ్యాపారులకు వాటాలుగా చెల్లించాల్సి ఉన్నప్పటికి వాటిని మధ్యం ముడుపుల వ్యవహారంలో పక్కకు పెట్టి పంచకుండానే సహవ్యాపారుల నోట్లో మట్టికొట్టారు. ఇప్పటికే బొత్స హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను అతనిని అనర్హునిగా ప్రకటించాలంటూ ప్రజావాజ్యాలు దాఖలైయ్యాయి. ఇటు తెలంగాణను సమర్థిస్తూ అటు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు కావాలంటూ ప్రకటనలు చేసిన ఆయనపై ఆంధ్రప్రాంతంలో ప్రజలు తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రవాణా శాఖమంత్రిగా ప్రైవేటు బస్సుల వ్యవహారంలో సమర్థవంతంగా వ్యవహరించకపోవడం కూడా విమర్శలకు దారి తీస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో తన బంధువర్గాన్ని నింపి మధ్యం, ఇసుక వంటి వ్యాపారాల్లో కోట్లాదిరూపాయలను ఆర్జీస్తున్న ఆయన తన సర్వాధికారాలను షాడో మంత్రి, తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసురావు అనే చిన్న శ్రీనుకు అప్పగించడంతో అధికారుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. కలెక్టర్‌ వీరబ్రహ్మయ్యతో సహా పలువురు అధికారులు విజయనగరం జిల్లా నుంచి బదిలీకి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బొత్స సతీమణి, విజయనగరం ఎంపి ఝాన్సీలక్ష్మీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, మరో తమ్ముడు, గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనరసయ్య కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో బొత్స కుటుంబమే పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమై, ఒక్క అవినీతిలో మాత్రమే సఫలమైనట్టు సర్వత్రా వినిపిస్తోంది.