పీడీపీ జోలికి రావొద్దు

– 1987 తరహా రాజకీయాలు ఇప్పుడు వద్దు
– భాజపాను హెచ్చరించిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) జోలికి రావొద్దని ఆ పార్టీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భాజపాను పరోక్షంగా హెచ్చరించారు. పీడీపీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె వెల్లడించారు. 1987 తరహా రాజకీయాలు ఇప్పుడు చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తే.. అప్పుడు సలావుద్దీన్‌, యాసిన్‌ మాలిక్‌ వచ్చినట్లుగానే ఇప్పుడు మరింత మంది పుట్టుకువస్తారన్నారు. పీడీపీలో వర్గాలను ప్రోత్సహిస్తూ, చీల్చాలని చూస్తే భారత రాజ్యాంగంపై కశ్మీరీలకు నమ్మకం పోతుందని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నట్లుగా.. పార్టీలోనూ కొన్నిసార్లు ఇబ్బందులుంటాయని, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె అన్నారు. పీడీపీకి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్‌లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్‌ పాలన నడుస్తోంది. అయితే పలువురు పీడీపీ నేతలు భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఫ్తీ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భాజపా, పీడీపీల పొత్తు ముగిసిన వెంటనే కూడా ముఫ్తీ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తే కశ్మీర్‌ ప్రజలకు భారత ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందని ఆమె హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విధమైన హెచ్చరికలు చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పీడీపీ విఫలమయ్యిందని ఆరోపిస్తూ భాజపా మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ను మూడేళ్ల పాటు పాలించింది. ఈ ఏడాది జూన్‌లో భాజపా మద్దతు ఉపసహరించుకోవడంతో ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు.