పీర్జాదిగూడ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు దమ్ముందా?

చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజల క్షేత్రంలోకి రావాలే
కార్పొరేషన్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఫైర్
మేడిపల్లి – జనంసాక్షి
పీర్జాదిగూడ మేయర్, డిప్యూటీ మేయర్, పాలకవర్గం సభ్యులకు కార్పొరేషన్ లావాదేవీలలో పంపకాల పంచాయితీ వచ్చినప్పుడు మాత్రమే రాద్దాంతం చేయడం, పంపకాల లెక్కలు కుదిరిన తరువాత మళ్ళీ ఒక్కటైపోవడం షరమాములేనని కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఫైరయ్యారు. ఇవన్నీ కట్టు కథలు, డ్రామాలని, కేవలం ప్రజా సమస్యల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకులే ఇలాంటి నాటకాలకు తెరలేపడం జరుగుతుందని విమర్శించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గంలో పంపకాల పంచాయతీ వచ్చినప్పుడల్లా అధికార పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పంపకాల లెక్కలు సద్దుమణిగాక మళ్ళీ కలిసి పోవడం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి పరిపాటిగా మారిందన్నారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి అవినీతిపై ఒంటికాలిపై ఎగురుతున్న డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కు దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా చెత్త పంచాయితీ ఆజ్యం పోసి లెక్కలన్ని సద్దుమణిగాక మళ్ళీ మేయర్, డిప్యూటీ మేయర్ చెట్టపట్టాలేసుకుని తిరగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టి పెట్టి ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హమీల అమలుకు ప్రయత్నం చేయాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను చేపట్టి మీ సంగతి తెలుస్తామని హెచ్చరించారు.
ప్రజలకు సమాధానం చెప్పాలి..
పేదలకు డబుల్ బెడ్రుం ఇండ్ల పంపిణీ చేస్తామని చెప్పి, లబ్ధిదారుల లిస్ట్ వచ్చినా ఎందుకు అందచేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా మీపై లేదా అని రవి ప్రశ్నించారు. రెండు సంవత్సరాల క్రితం అకాల వర్షాలతో కార్పొరేషన్ మొత్తం అతలాకుతలమై కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా చేయడం కోసం ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు కింద 110 కోట్ల రూపాయల వ్యయంతో మూసికి అనుసంధానంగా నాలా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఅర్ స్వయంగా వచ్చి ఇచ్చిన హమీ ఎందుకు నెరవేరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేసేందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 118 ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఎందుకు విమర్శిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇప్పటికైన మీకు చిత్త శుద్ధి ఉంటే ఈ మూడు సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుధల చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలోనే కార్పొరేషన్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్, సీడీఎంఏ,సీఎస్ లకు లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని అధికార పార్టీ కావడంతో దర్యాప్తులో నిర్లక్ష్యం కనపడుతుందని అన్నాడు. త్వరలోనే కార్పొరేషన్ లోని అన్ని డివిజన్ లలో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకోంటు ఉద్యమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపోందిస్తామని అన్నారు.