పుట్టగొడుగుల అక్రమ వెంచర్లు.

మామూలు మత్తులో అధికారులు..??
జనం సాక్షి /కొల్చారం   మండలం రంగంపేటలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు మత్తులో నిబంధనలకు తిరోధకాలిస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం 10 శాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కనీస సౌకర్యాలైన డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు మంచినీటి సౌకర్యం రోడ్లు పార్కు లాంటి వసతులు కల్పించి గ్రామపంచాయతీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ, మండల పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో డిటిసిపి అనుమతికి పంపాలి. డిటిసిపి అనుమతులు వచ్చిన తర్వాత ఫ్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. రంగంపేట లో ఉన్న ఐదు వెంచర్లలో కనీస వసతులు కరువయ్యాయి. చెరువుకుంటల సమీపంలో ఏర్పాటు చేసే వెంచర్లకు ఎఫ్టిఎల్ పరిశీలించి అనుమతించాలి. అలాగే గ్రామకంఠంలో ఉన్న స్థలానికి ఫ్లాట్లుగా విక్రయించే అవకాశం లేదు. కానీ రంగంపేటలో మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఫ్లాట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.  అమాయకులు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫ్లాట్లను కొని మోసపోతున్నారు. అలాగే ఎలాంటి అనుమతి లేకుండానే కొత్త భవన నిర్మాణాలు జరుగుతున్నా పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ప్రియాంక మాట్లాడుతూ తనకంటే ముందు ఉన్న అధికారి సిఫారసుతో రెండు వెంచర్లు మాత్రం డిడిసిపి ఆమోదం పొందాయని తెలిపారు