పులిచింతలను ఎందుకు అడ్డుకోలేదు
ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
నల్లగొండ,జూన్ 24(జనంసాక్షి):తెలంగాణ ప్రగతికి బాటలు వేసే ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ క మిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన మంత్రులు హరీశ్‌రావు, జగ దీశ్‌రెడ్డి కార్యకర్తల విస్తృస్థాయి సమావేశంలో
పాల్గొన్నారు.పులిచింతల ప్రాజెక్టును ఆక్షేపించని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దు అనే అర్హత లేదని హరీశ్‌రావు అన్నారు. 10లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్, తెదేపా నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు అజెండా అమలు చేస్తున్న టిడిపి నాయకులు పోలవరం ముంపుపై ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… మల్లన్నసాగర్ వద్దని అడిగే హక్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కు ఉందా అన్ని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టు కింద మునిగేది తెలంగాణ… నీళ్లు పారేది ఆంద్రాలో. పులిచింతల ప్రాజెక్టు కింద 13 గ్రామాల్లో 13వేల ఎకరాలు ముంపునకు గురైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అప్పట్లో బాధితులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించింది. కరీంనగర్ జిల్లా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 49 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఆ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రెండు వాగుల కింద అక్విడెక్టులు కడితే ముంపు ఉండదని ఇంజినీర్లు చెప్పారు. అక్కడేమే తోటపల్లి ప్రాజెక్టును కట్టాలని, గ్రామాలను ముంచాలని ధర్నా చేసిన నాయకులు ఇక్కడ ముంపునకు గురికాకుండా ప్రాజెక్టు కట్టాలని అనడం విడ్డూగా ఉందన్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా అడ్డుకోవడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి. మంచి పని చేస్తే జీర్ణించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ నాయకలు లేరని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు. నాలుగు జిల్లాల రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తామని ముంపునకు గురయ్యే నాలుగు గ్రామాల ప్రజలకు మెరుగైన పరిహారం చెల్లించి ఒప్పిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకుంటే ప్రతిపక్షాలను తరిమికొడతామని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సుమలత ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ అందించి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణ సస్యశ్యామలవుతది అని చెప్పారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటాయని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కట్టి నీటిని నిల్వ చేస్తేనే బీడు భూములు పచ్చగా మారుతాయన్నారు. కోటి ఎకరాలకు నీరందించడం,నిరంతరాయంగా విద్యుత్ అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. దీనిని అడ్డుకోవడమే విపక్షాల లక్ష్యమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విప్ గొంగడి సునీత తదితరులు పాల్గొన్నారు.