పువ్వాడ రాకలో తుమ్మల హస్తం
ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు
ఖమ్మం,ఏప్రిల్25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్ వర్గాలను అయోమయంలోకి ఎట్టింది. ఇది ఓ రకంగా కాంగ్రెస్ నేతలకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఓ వైపు పస్లీనరీ, మరోవైపు ఉప ఎన్నిక జరుగుతన్న తరుణంలో అజయ్ నిర్ణయం పార్టీకి శరాఘాతంగా మారనుంది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయబోతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పావులు కదిపి అజయ్‌ను పార్టీలోకి లాగారన్న విమర్శుల ఉన్నాయి. అయితే అజయ్ కూడా కాంగ్రెస్ నేతల తీరుకు నిరసనగా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా పార్టీ నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ , జానారెడ్డిలపై పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా చెబుతున్నారు. అజయ్ పార్టీ వీడనుండడంతో శాసనసభలో కాంగ్రెస్ బలం మరింత తగ్గింది. 13 మంది మాత్రమే మిగిలారు. ఇది ఖమ్మం ఉపఎన్నికలపైనే గాక ఇతర రకాలుగా ప్రభావం చూపుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పువ్వాడ రాజీనామా ప్రకటించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు ఫారూఖ్ హుస్సేన్ సైతం తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం తెరాసవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు అధికార పార్టీకి నూతనోత్తేజం ఇచ్చేదిగా ఉంది.సీపీఐ సీనియర్‌నేత పువ్వాడ నాగేశ్వర్‌రావు కుమారుడైన అజయ్‌కుమార్ ఖమ్మంలో పార్టీకి ఆయువుపట్టుగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన విజయం సంచలనం సృష్టించింది. ఇటీవలి నగర పాలకసంస్థ ఎన్నికల్లోనూ తన ఉనికిని చాటుకున్నారు. శాసనసభలో గట్టిగా తన వాణి వినిపించారు. ఉపఎన్నికల సందర్భంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా పార్టీని వీడారు. కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సభలో చర్చల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడం, కీలక కమిటీల్లో బాధ్యతలు కల్పించకపోవడం వంటి వాటిపై మధనపడుతున్నట్లు తెలిసింది. గత ఎన్నికల సందర్భంగా పార్టీ సత్తాచాటిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ నాలుగు స్థానాల్లో పార్టీ గెలిచింది. ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే తెరాసలో చేరారు. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు పువ్వాడ కూడా పార్టీ వీడితే ఇక ఖమ్మంలో కాంగ్రెస్‌కు దిక్కే లేదని, ఒక్క భట్టి విక్రమార్క మాత్రమే మిగిలేలా ఉంది. ఆయన రాజీనామాతో ఇక కాంగ్రెస్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఒక్కరే మిగిలారు.పాలేరు ఉపఎన్నికల సమయంలో ఈ పరిణామం శరాఘాతంగా మారింది. ఇప్పటికే పార్టీనేతలు విపక్షాల మద్దతు సవిూకరణ యత్నాల్లో ఉన్నారు. వైకాపా, తెదేపాలు మద్దతు ఇచ్చాయి. సీపీఐపై నమ్మకం ఉండగా సీపీఎంను ఒప్పించే యత్నాల్లో ఉన్నారు. విపక్షాలను కలుపుకొని తెరాసపై పైచేయి సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పువ్వాడలో అసంతృప్తిని పార్టీ నేతలు కనిపెట్టినా ఆయనను సముదాయించేందుకు సరైన యత్నాలు చేయలేదనే భావన పార్టీవర్గాల్లో ఉంది. సీఎల్పీ నేత జానారెడ్డి ఆదివారం ఆయనతో మాట్లాడినా అప్పటికే ఆలస్యం జరిగింది. మరికొందరు శాసనసభ్యుల్లోనూ అసమ్మతి నెలకొంది. తెరాస నేతలు వారితో చర్చలు జరుపుతున్నారు. అయితే ఖమ్మంనకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పావుఉల కదిపారని సమచారం. ఇకపోతే మెదక్ జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు ఫారుఖ్‌హుస్సేన్ సైతం ఎమ్మెల్యే పువ్వాడతో పాటు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫారూఖ్ రాజీనామా చేస్తే మండలి కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఏడుకు చేరనుంది.