పూడిక తీస్తేనే.. జలకళ

జగిత్యాల   :  ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అరుున ఎస్సారెస్పీలో పూడిక నిండిపోతోంది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం నానాటికీ తగ్గుతోంది. దీని ప్రభావం ఆయకట్టుపై పడుతోంది. 112.02 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా.. ఇప్పుడు ఆ సామర్థ్యం 90.31 టీఎంసీలకు పడిపోరుుంది. ఇప్పటికి ప్రాజెక్టులో ఎంతమేర పూడిక పేరుకుపోరుుందనే విషయమై నాలుగుసార్లు సర్వే చేసినా ప్రయోజనం లేకపోరుుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణకు పూనుకుంది. అందులో భాగంగానే ఎస్సారెస్పీ ప్రాజెక్టులోని పూడికను తొలగించేలా చర్యలు తీసుకుంటే ఉత్తర తెలంగాణ రైతులకు మరింత తోడ్పడనుంది. సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతాంగమూ కోరుతోంది.

ఈయేడు 14 టీఎంసీలే…
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టుతోపాటు మరో 11 ప్రాజెక్టులు నిర్మించింది. మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో నీరు నిండే వరకు ఎస్సారెస్పీలోకి వరదనీరు చేరే అవకాశమే లేదు. మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి ఏటా చెత్తాచెదారం వచ్చి ఈ ప్రాజెక్టులో చేరి రైతులకు సాగునీరు కష్టతరమవుతోంది. ఈ యేడు వర్షాలు తక్కువగా కురిశాయి. ఇప్పటివరకు ప్రాజెక్టులో 14 టీఎంసీల నీరే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండినా 13 లక్షల ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి ఉంది.

తాగునీటి అవసరాల కోసం..
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు ఎస్సారెస్పీ కాలువల నుంచే చాలా గ్రామాలకు తాగునీరందిస్తారు. ఈయేడు వర్షాభావ పరిస్థితుల్లో వచ్చే వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులో ఉన్న 17 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. సాగునీటి , తాగునీటి అవసరాలు తీరేలా మునుపటిలా 112.02 టీఎంసీల నీటి నిల్వ పెరగాలంటే పూడికను తొలగించాలి.

40 కిలోమీటర్ల మేర ఎడారే..
తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి పోచంపాడ్ వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర గోదావరినది పరివాహక ప్రాంతం ఉంది. ఈయేడు వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పుడే గోదావరి ఎడారిలా కనిపిస్తోంది. ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల మేర నీటినిల్వ కనిపిస్తోంది. మరో 40 కిలోమీటర్లు వట్టిపోయి కనిపిస్తున్న గోదావరిలో పూడికపై దృష్టిపెట్టాలి. భారీ వర్షాలు కురియకముందే దృష్టిపెడితే పూడిక తొలగింపు సులభమవుతుంది. పూడిక మట్టిని పంట పొలాలకు తరలించే విషయంపై దృష్టిపెట్టాలి. అరుుతే.. పూడిక నివేదిక ప్రభుత్వం దృష్టిలో ఉందని, పెద్ద ప్రాజెక్టుల్లోని పూడికను ఒకేసారి తొలగించడం సాధ్యం కాదని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1963లో అప్పటి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. సుమారు 19.31 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. ప్రాజెక్టుకు 42 గేట్లు ఏర్పాటు చేశారు. 1978 నవంబర్ 5న అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పోచంపాడ్‌ను సందర్శించారు. దీనికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.