పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ వేతనాలు ఏడు నెలలుగా పెండింగులో ఉన్నాయని,వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రగతిశీల మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ అసోసియేషన్ , ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం డిఈఓ అశోక్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐఎఫ్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడుతూ గత ఏడు నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉంచి వర్కర్స్ ను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.హాస్టల్ వర్కర్స్ పట్ల విద్యాశాఖ అధికారులకు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.వర్కర్లకు వేతనాలను ఇవ్వకుండా టెండర్ వాళ్ల బిల్లులు చేయడం సరికాదన్నారు.దసరా పండుగ నాటికైనా వేతనాలు విడుదల చేస్తారని వర్కర్లు ఎదురు చూస్తుంటే, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.తక్షణమే ఏడు నెలల వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు మంగమ్మ , కళావతి , నాగమ్మ , విమల, పద్మ , సునీత తదితరులు పాల్గొన్నారు.