పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శం

పక్కాగా ఏర్పాట్లు పూర్తి: మంత్రి
నిజామబాద్‌,మే8(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం ఒక విప్లవమని, ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి అందించనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ పథకం జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. సీఎం రైతుబిడ్డ అని, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. దేశంలోనే వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీరు అందించడానికి చేపట్టే పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇదిలావుంటే
రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని అన్నారు.  గ్రామ పహాణీ ప్రతి దగ్గర ఉంచుకొని, రైతులకు ముందుగానే పాస్‌ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలన్నారు. పంపిణీ చేయని బుక్కులు, చెక్కుల వివరాలు ఎందువల్ల అందజేయడం లేదో లిస్టును తయారు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కులు పంపిణీ చేసే స్థలంలో రైతులు 300లకు మించితే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి, కౌంటర్‌ వివరాలు కేటాయించిన గది వద్ద అతికించాలన్నారు. చెక్కులు తీసుకోవడానికి వచ్చే రైతుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు వేయించి, పంపిణీ కేంద్రంలో ఒక మైక్‌ సిస్టమ్‌ను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ టీముకు ఒక గ్రీవెన్స్‌ అధికారిని నియామకం చేస్తున్నట్లు చెప్పారు. ఆ అధికారి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ రెవెన్యూ గ్రామాల వారీగా వచ్చిన విజ్ఞప్తులను నమోదు చేయాలన్నారు.