పెట్టుబడులతో రండి ప్రవాస భారతీయులకు ప్రధాని పిలుపు
కొచి, జనవరి 8 (జనంసాక్షి):
వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. ప్రధానంగా మౌలిక వసతులు, విద్యా, విద్యుత్, నీటి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపాలని కోరారు. ప్రవాస భారతీయుల మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ ప్రవాస భారతీయ దివాస్‌ను ప్రధాని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులకు
భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని హావిూ ఇచ్చారు. అది ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని చెప్పారు. పౌరులకు సాయం చేయడం ‘దేశాల ప్రథమ బాధ్యత. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ వెనుకాడదు’ అని అన్నారు. విదేశాలకు వలస వెళ్లిన వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనుందని, ఇన్సురెన్స్ పథకాలు తీసుకురానుందన్నారు. ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయుల ఆర్థిక, సామాజిక రక్షణకు ఆయా దేశాలతో భారత్ సామాజిక రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రవాసీ భారతీయ దివాస్‌కు మూలం గడర్ ఉద్యమమేనని ప్రధాని అన్నారు. గడర్ ఉద్యమానికి ప్రతీకగా రూపొందించిన స్టాంపులు, కవర్లను ఆయన విడుదల చేశారు.