పెట్రో ధరలపై రాహుల్‌ నిరసన


సైకిల్‌ తొక్కి ఎన్నికల్లో ప్రచారం

బెంగుళూరు,మే7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం కర్ణాటకలోని కోలార్‌లో పర్యటించారు. వినూత్నరీతిలో ఎన్‌ఇనకల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాహుల్‌ సైకిల్‌ తొక్కి తన నిరసన వ్యక్తం చేశారు. తొలుత కోలార్‌లో నిర్వహించిన రోడ్‌షోలో రాహుల్‌ పాల్గొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులో రాహుల్‌ ప్రయాణించారు. ఆ తర్వాత చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఎద్దుల బండి ఎక్కి కొద్ది దూరం ప్రయాణం చేశారు. అనంతరం సైకిల్‌ తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ‘మొబైల్‌ ఫోన్‌లో మూడు మోడ్స్‌ ఉంటాయి. వర్క్‌ మోడ్‌, స్పీకర్‌ మోడ్‌, ఎయిరోప్లేన్‌ మోడ్‌. ప్రధాని మోదీ కేవలం స్పీకర్‌ మోడ్‌, ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లు మాత్రమే ఉపయోగిస్తారు. వర్క్‌ మోడ్‌ను ఎప్పటికీ ఉపయోగించరు’ అంటూ రాహుల్‌ చమత్కరించారు. అంతకుముందు ట్విటర్‌లోనూ రాహుల్‌ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పెట్రోల్‌ ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని, దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సవిూపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. వీలు చిక్కినప్పుడల్లా పరస్పరం మాటల దాడికి దిగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. మే 15న ఫలితాలు వెలువడుతాయి.
————