పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన నర్సయ్య, మల్లేశ్‌ విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. నర్సయ్యకు భార్య లక్ష్మవ్వ, కూతురు సంధ్యారాణి, కుమారుడు భీమలింగు, సంతోష్‌ ఉన్నారు. ఈయన తనకున్న రెండెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు. భార్యభర్తలిద్దరు ఉపాధి పనులకు వెళ్లి పొట్టపోసుకునే వారు. మల్లేశ్‌కు భార్య శకుంతల, కూతురు లావణ్య, కొడుకు స్వాదేవ్‌ ఉన్నారు. వీరు కూడా ఉపాధి పునులకు వెళ్లేవారు. కుటుంబ పెద్దలిద్దకు మృతిచెందడంతో వీరి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
తగిన స్తంభాలు లేకే తెగిన తీగలు
పస్పుల గ్రామ శివారులోని కడెం వాగు మీదుగా గ్రామానికి వచ్చే విద్యుత్‌ తీగలకు దూరానికి కావాల్సినన్ని స్తంభాలు లేకపోవడంతో తీగలు తెగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కిలో మీటరుపైగా దూరంలో ఉన్న స్తంభానికి అటువైపు నుంచి ఇటువైపు వరకు ఒక్కటే విద్యుత్‌ తీగ కారణంగా ఇది తెగిపోయిందని వారు పేర్కొంటున్నారు. గతంలో కూడా పలుసార్లు విద్యుత్‌ తీగలు తెగినట్లు గ్రామస్తులు పేర్కొంటారు. మధ్యలో కొన్ని స్తంభాలు వేయాల్సి ఉండగా వేయలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల కర్ర స్తంభాలు ఉన్నాయని వాటిని తొలగించి స్తంభాలు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో
విదుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు గిరిజన రైతులు మృత్యువాత పడ్డారని, వారికి ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామానికి చెందిన రైతులు, మృతుల కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి సబ్‌స్టేషన్‌ ఎదుట మృతదేహాలతో రాస్తారోకో, ధర్నా చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గంటకుపైగా బైఠాయించారు. సంఘటన స్థలానికి వచ్చిన విద్యుత్‌శాఖ నిర్మల్‌ డీ ఈఈ ప్రమోద్‌ను నాయకులు నిలదీశారు. నష్టపరిహారం చెల్లించే వరకు కదలమని బైఠాయించారు. అనంతరం రూ.1.50 లక్షలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
అపద్బంధు పథకం ద్వారా రూ. 50 వేలు వచ్చేలా కృషి చేస్తానని తహశీల్దార్‌ కనకయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తనయుడు రితీష్‌ రాథోడ్‌, మాజీ సర్పంచ్‌ ఆకుల శ్రీనివాప్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకాగౌడ్‌, మాజీ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రేఖాశ్యాంనాయక్‌, పస్పుల మాజీ సర్పంచ్‌ బూక్య గోవింద్‌ నాయకులు, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య , మండల అధ్యక్షుడు మాన్కదేవన్న, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పొద్దుటూరి మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు శ్రీరాంనాయక్‌, మండల, పట్టణ కన్వీనర్‌లు మురళి, రాజెందర్‌, కడెం కన్వీనర్‌ పురుషోత్తం, జిల్లా స్టీరింగ్‌ కమిటీ మెంబర్‌ రాజేష్‌ , కే రవి, నాయకులు రాజేందర్‌ నాగేష్‌, అజ్గర్‌, సంతోష్‌, రైతులు పాల్గొన్నారు.