పేక మేడలు నిర్మిస్తున్నా పట్టించుకోరా?

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని థానేలో మూడు రోజుల క్రితం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. నిరుపేదలకు తక్కువ అద్దెను ఎరగా చూపి అద్దెకు దింపిన బిల్డర్లు నిర్మాణంలో మాత్రం ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తర్వాతి క్రమంలో భవన నిర్మాణాన్ని కనీసం పరిశీలించలేదు. అనుమతి పొందిన బిల్డర్లు నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కనీసం పర్యవేక్షించలేదంటే వారు ఎంత అసలత్వంతో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఏడంతుస్తుల భవనం నిర్మించారంటే మునిసిపల్‌ అధికారులు ఎంత గుడ్డిగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ముంబయి.. ఎన్నో లక్షల మంది నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్న మహా నగరం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ముంబయికి వలస వచ్చి వివిధ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారంతా చిన్నపాటి అద్దె గదుల్లో బతుకులీడుస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఎందరో బిల్డర్లు అగ్గిపెట్టెల్లాంటి గదులతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి భవనాన్నే థానేలో నిర్మించి తక్కువ అద్దెకు గదులిస్తామని ప్రచారం చేసుకొని బిల్డర్లు పెద్ద మొత్తంలో డబ్బు పోగేసుకోవాలని ప్రయత్నించారు. అందుకోసమే వీలైనంత త్వరగా భవనాన్ని నిర్మించాలని ప్రయత్నించారు. సెల్లార్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ నిర్మాణం కూడా పూర్తి కాని 30 రోజుల్లోనే ఏడు అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేసేశారు. కనీసం సిమెంట్‌ క్యూరింగ్‌ కూడా చేయించలేదు. ఎంతసేపు ధర్జాననే ధ్యేయంగా పెట్టుకొని భవన నిర్మాణం చేపట్టారు. వీలైనంత త్వరగా పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలనే ఆతృత ప్రదర్శించారు. వారి ఆతృత ఫలితంగానే 74 మంది దుర్మరణం చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఎందరో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలయ్యారు. ఇదంతా ఇద్దరు బిల్డర్లు, కొందరు అధికారుల నిర్లక్ష్యానికి ప్రతిఫలమే. కేవలం వారి ధనార్జన తత్వమే. కూలింది కాబట్టి థానే భవనం దేశ ప్రజలనందరినీ అటువైపుగా దృష్టి సారించేలా చేసింది. కానీ ఇలాంటి పేకమేడలు ఇప్పుడు విస్తరిస్తున్న అన్ని మహానగరాల్లోనూ దర్శనమిస్తున్నాయి. నెల రోజులు కాకుంటే రెండు నెలలు. అంతకుమించి ఎక్కువ సమయం భవన నిర్మాణానికి బిల్డర్లు కేటాయించడం లేదు. వాళ్లు కేటాయించడం లేదు అనేకంటే అధికారుల్లో పట్టింపులేనితనం, లంచగొండితనమే ఇందుకు ప్రధాన కారణం అనుకోవాలి. భవన నిర్మాణానికి అనుమతులిచ్చే సమయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు బిల్డింగ్‌ ప్లాన్‌ను, మునిసిపల్‌ నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌ ఇతరత్రా నిబంధనలు పాటిస్తున్నారా అని మాత్రమే చూస్తున్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి కనీసం ఎంత స్థలం అవసరం.. పార్కింగ్‌ కోసం ఎంత స్థలాన్ని విడిచిపెట్టాలి. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దవాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు, పని ఒత్తిడితో ఇళ్లకు చేరవారు కాసింత సేద తీరేందుకు ప్రతి నివాస సముదాయంలో ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. ఆ స్థలంలో చిన్నపాటి పార్కు, మినీ కోర్టులు ఏర్పాటు చేయాలి. నివాసముదాయానికి కనీసం రెండు వైపులా విశాలమైన రోడ్లు ఉండాలి. భవనం చుట్టూ అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్‌ తిరిగేంత చోటు ఉండాలి. లేదా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సూచించిన విధంగా అన్ని అంతస్తులకు ప్రత్యేక పాయింట్ల ద్వారా నీటిని పంపింగ్‌ చేసే సిస్టం, నీటిపైపులు నాలుగు దిక్కులా తీసుకెళ్లేలా ఖాళీ స్థలం విడిచి పెట్టాలి. అంబులెన్స్‌ వచ్చివెళ్లేంత స్థలం ఉండాలి. కానీ మహానగరాల్లోని మురికివాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న నిర్మాణాల్లో వీటిలో ఏ ఒక్క ప్రమాణాన్ని పాటించడం లేదు. కనీసం సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మాణాలు చేస్తున్నా.. నిర్మాణంలో నిర్దిష్ట పరిమాణాల్లో సిమెంట్‌, ఐరన్‌ ఉపయోగించకున్నా కనీసం నోటీసులు జారీ చేసే నాథుడే లేడు. దీంతో బిల్డర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. గతేడాది హైదరాబాద్‌లోనూ నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం కుప్పకూలి కూలీలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు అన్ని మహా నగరాల్లోనూ తరచూ జరుగుతున్నాయి. అయినా ప్రమాదాలను అరికట్టేందుకు పురపాలకశాఖ అధికారులు చర్యలేమి చేపట్టడం లేదు. ఈ జాడ్యం మహా నగరాలకే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనూ ఇలాంటి నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేసేందుకు అంతేస్థాయిలో బేస్మెంట్‌ నిర్మించాలి. అసలు భవన నిర్మాణం చేపట్టే భూమి బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుకూలమైనదిగా ఉండాలి. కానీ భూమి స్వభావం ఎలాంటిదైనా లంచాలు బుక్కేస్తున్న అధికారులు కళ్లు మూసుకొని అనుమతులిచ్చేస్తున్నారు. దాని ఫలితమే థానేలో పెను ప్రమాదం. థానేలో ఇదొక్కటే కాదు ఇలాంటివే ఎన్నో భవనాలు ఉన్నాయి. కొన్ని మహానగరాల్లో బిల్డర్స్‌ మాఫియా అధికారుల పనితీరునే శాసించేస్థాయిలో ఉంది. అక్రమ నిర్మాణాలకు అడ్డుపడే వారిని వేధించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించడం.. ఇంకో అడుగు ముందుకేసి అసలు భూమి మీదనే లేకుండా చేస్తామని బెదిరించే స్థాయిలో ఉంది. పాలకులు, వివిధ రాజకీయ పక్షాల అండదండలతో బిల్డర్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. రియల్‌ ఎస్టేట్‌, బిల్డర్ల ముసుగులో సాగుతున్న అక్రమాలను నియంత్రించకుంటే భవిష్యత్‌లో మహానగరాలు శిథిలాల దిబ్బలుగా, సమాధుల సముదాయాలుగా మారడం ఖాయం.