పేదల ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలివ్వాలి
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
సూర్యాపేట కలెక్టరేట్ (జనంసాక్షి) : పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేదల అధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ,పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ,డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్న నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు.జిల్లాలో 1991 నుండి 2000 సంవత్సరం వరకు 130 గ్రామాలలో బలహీన వర్గాల కాలనీల కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారన్నారు.అట్టి భూమిని పేదలకు పంచి ఇవ్వకపోవడం మూలంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పేదల అధీనంలో ఉన్న భూమికి వెంటనే పట్టాలిచ్చి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం అవి పూర్తయి ఆరు సంవత్సరాలు అవుతున్న నేటికీ లబ్ధిదారులను గుర్తించి ఇల్లు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందన్నారు.జిల్లాలో ఇంకా అసంపూర్తిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఫండ్స్ కేటాయించి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయాలని కోరారు.అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇచ్చిన హామీని కెసిఆర్ నేటికి అమలు చేయలేదన్నారు. రేషన్ కార్డులు లేక లక్షలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు.వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ,చేతివృత్తిదారులు పింఛన్ల కోసం గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి పింఛన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కార్మికుల హక్కులను బిజెపి ప్రభుత్వం కాల రాస్తుందని అన్నారు.రైతాంగానికి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత బంధు పథకం ద్వారా దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. దళిత, గిరిజనులకు ఉచిత కరెంటును ఇవ్వాలన్నారు. పోడు భూముల కు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న వక్స్ బోర్డు భూములను రక్షించాలని కోరారు.ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.కల్లుగీత కార్మికులను పరిష్కరించి జిల్లాలో తాటి ,ఈత ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు ఐదువేల రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల ,మేకల పెంపకం దారులకు నగదు బదిలీ అమలు చేసి గొల్ల ,కురుమ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఓ శ్రీదేవికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ , సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు ,కొలిశెట్టి యాదగిరిరావు ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ రవి నాయక్ ,కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ ,పట్నం జిల్లా కన్వీనర్ నరసింహారావు , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలితి పద్మావతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శీలం శీను ,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చల కూర రాంబాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాసాని కిషోర్ ,బోయిల్లా నవీన్ ,జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహింగీర్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు,సిఐటియు జిల్లా నాయకురాలు చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా నాయకురాలు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.