పేదల కడుపు నింపే ప్రభుత్వం మాది
రైతుల కోసం అనేక పథకాలు పెట్టాం
అభివృద్గిలో తెలంగాణ ముందున్నది: పోచారం
కామారెడ్డి,సెప్టెంబర్17(జనంసాక్షి : పేదల కడుపు నింపేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమైతే.. కడుపు కొట్టేది మాత్రం కాంగ్రెస్ నాయకులు అని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గ్రావిూణ ప్రాంతాల అవసరాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటంతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఉంటామని వర్నీ మండలం
వకీల్‌ఫారం, అపందిఫారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, పేదల గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కాబట్టి గ్రామాలకు గ్రామాలే స్వచ్చందంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. దేశంలో అత్యధిక మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని సగం గ్రామాలకు పైగా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవం కానున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో రైతులకు ఎన్నో పథకాలను తీసుకు వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకు వచ్చి కర్షకులకు కొండంత అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణకే చెల్లుతుందని పోచారం అన్నారు. రైతులంతా సీఎం కేసీఆర్ కృషిని గమనించి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలని కోరారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటలకు ఊపిరి పోసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో లక్షల ఎకరాల్లో పంటలకు సాగునీరు అవసరమవ్వగా వర్షాభావ పరిస్థితులతో అక్కడకక్కడ రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి స్వయంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిజాంసాగర్ డిస్టిబ్యూట్రరీ కెనాల్స్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయించారు. 14వ తేదీ ప్రారంభమైన నీటి విడుదల సగటున 1000 క్యూసెక్కుల మేర దిగువకు చేరుతున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు నిజాంసాగర్ నీళ్లను పంటల కోసం వదిలి పెడుతున్నట్లు పోచారం చెప్పారు. రైతులు వేసిన పొలాలను రక్షించడానికి నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని కూడ విడుదల చేసేందుకు పోచారం ముందడుగు వేశారు. పంటల పరిస్థితిని గమనించి రైతుల కష్టాలు తీర్చినందుకు ఆయకట్టు రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. పొట్ట దశకు వచ్చిన పంటలకు ఊరట లభించిందని అన్నారు.