పేదల గొంతు వినిపించడమే.. తెదేపా చేసిన నేరమా?

– ఉల్లిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలి
– సభలో అధికార పక్షాన్ని నిలదీద్దాం
– టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పేదల గొంతును సభలో వినిపించడమే తెదేపా చేసిన నేరమైందని, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫాసిస్ట్‌ ధోరణితో వ్యవహరిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు బాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు శ్రద్ధ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని అణిచేయడంపైనే వైసీపీ దృష్టి పెట్టిందని ఆయన మండిపడ్డారు. పేదల కష్టాలపై సభలో నిలదీస్తే టీడీపీని అణిచేస్తారా..? అంటూ బాబు ఆగ్రహానికి లోనయ్యారు. తన చర్యలను ఎవరూ ప్రశ్నించరాదనేదే సీఎం ఫాసిస్ట్‌ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఉల్లి ధరలపై ప్రజల్లో వ్యతిరేకతను సోమవారం సభలో ప్రతిధ్వనింపచేశామని, ప్రజల కష్టాలను, మహిళల అవస్థలను సభ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లుకు బాబు పిలుపునిచ్చారు. ఉల్లి కోసం వెళ్తే ఉసురు తీయడం అమానుషని ఆయన అన్నారు. ఉల్లిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉల్లి డోర్‌ డెలివరీ చేయకపోతే వాలంటీర్లకు జీతాలు దండగ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడి ముగ్గురు రైతులు మృతి చెందారని, సోమవారం ఉల్లి కోసం క్యూలైన్‌లో ఒకరు చనిపోయారని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.