పేలిన గ్యాస్‌ సిలీండర్‌ 

– ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
– కుషాయిగూడ స్టేషన్‌ పరిధిలో ఘటన
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓల్డ్‌ కాప్రా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోహన్‌లాల్‌ చౌదరి అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ భారీ శబ్దంతో పేలడంతో స్థానికులంతా షాకయ్యారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. పేలుడుకు చుట్టుపక్కల ఉన్న ఐదారు ఇల్లు కూలిపోయాయి. ఇక కిలో విూటర్‌ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. భవనంలోని రాయి ఎగురుతూ బైక్‌పై వెళ్తున్న రవి అనే వ్యక్తికి బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఇంట్లో ఉన్న మోహన్‌లాల్‌ చౌదరి(52)తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు గోవింద్‌ (12), నికిత (10), లీలా(45)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి తరలించే సమయంలో మోహన్‌లాల్‌ చౌదరి మృతిచెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  చనిపోయిన మోహన్‌ లాల్‌ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న
పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి చుట్టపక్కల ఇళ్ల అద్దాలన్నీ పగిలిపోయాయి. అరకిలోవిూటరు వరకు రాళ్లు ఎగిరిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. కిలోవిూటరు వరకు భారీశబ్దం వచ్చినట్లు తెలిపారు. తొలి అంతస్తులో ఉన్న మోహన్‌లాల్‌ సిలిండర్‌తో పాటు కిందికి పడటం చూసి అంతా షాకయ్యామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే కేవలం గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్లే ఇంత విధ్వంసం జరిగిందా? లేక వేరే కోణాలున్నాయా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.