పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కవ్వాల్‌ అభయారణ్యం అభివృద్దికి అడ్డుగా ఉన్న 37 గ్రామాల ప్రజలకు కోర్‌ ఏరియా నుంచి బయటకు రప్పించి.. అడవిని ఆనుకొని రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రెండు గ్రామాల ప్రజలను తప్పించి పైలట్‌ ప్రాజెక్టుగా అభివృద్ది చేస్తారు. ఇందుకు మంత్రి జోగురామన్న కూడా అంగీకరించారు. దీంతో అధికారులు ఈ గ్రామాల పునరావాసంపై దృష్టి సారించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ-ఎన్‌టీసీఏ మార్గ దర్శకాల మేరకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాల ప్రజలతో అటవీ శాఖాధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి చర్చలు చేశారు. దీంతో ఈ రెండు గ్రా మాల ప్రజలు కోర్‌ ఏరియా నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం కల్పించే పునరావాసం పొందేందుకు స్వచ్ఛందంగా తమ అంగీకారాన్ని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పునరావాసానికి ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం రూ.14.20కోట్లతో ఎన్‌టీసీఏకు ప్రతిపాదనలు పంపారు. వ్యవసాయం చేసుకునేందుకు కూడా భూములను

పంపిణీ చేయనున్నారు. కడెం మండలం పెత్తరపు గ్రామ సవిూపంలో రిజర్వ్‌ ఫారెస్టు భూములను 112 హెక్టార్లు కేటాయించారు. ఇందులో నిర్మాణాలకు రెండు హెక్టార్లు కేటాయించగా.. మిగతా 110 హెక్టార్లను ఆయా కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి రెండెకరాలకు తగ్గకుండా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రంలో ఇండ్లు, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, వైద్య సదుపాయాలతో పాటు తాగు, సాగునీటి వసతి కల్పిస్తారు. రిజర్వు ఫారెస్టు భూముల్లో సాగు చేసుకునే భూములను అభివృద్ధి చేసి ఇస్తారు. వచ్చే ఆరు, ఏడు నెలల్లో ఈ పైలట్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి.. వానాకాలం నాటికి ఈ గ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులను భాగస్వాములు చేయనున్నారు. ఈ గ్రామాల పునరావాస కల్పనపై జిల్లా కలెక్టర్‌ ఇలంబరిది అన్ని శాఖల అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ గ్రామాల్లో అన్ని శాఖల అధికారులు చేపట్టాల్సిన పనులు, ఎజెండాను జిల్లా స్థాయి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ పనులు చేపట్టే క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే.. పరిష్కరిం చేందుకు మండల స్థాయిలో డీఎఫ్‌వో, ఆర్‌డీవోతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రజలకు సమస్యలు వీరి దృష్టికి తీసుకెళ్తే.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తారు. అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపడతారు. నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం పరిధిలో నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 37 రెవెన్యూ గ్రామాలున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం(కోర్‌ ఏరియా)లో ఈ గ్రామాలు ఉండడంతో.. ప్రజలకు సరైన వసతులు అందడం లేదు. మరోవైపు జనం కదలికలు ఉండడంతో.. అటవీ జంతువులకు ఆవాస యోగ్యం కావడం లేదు. దీంతో మంత్రి జోగురామన్న కూడా అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలావుంటే అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌లో అడవుల సంరక్షణ బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా అటవీ అధికారి ప్రభాకర్‌ అన్నారు. అటవీ సంరక్షణ కోసం చేపట్టే కార్యక్రమాలు, స్మగ్లింగ్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలప అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా కలపను రవాణా చేస్తున్నారన్న సమాచారం వస్తుండటంతో ముందస్తుగా పోలీసుల సహకారం తీసుకొని ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకుంటున్నామని తెలిపారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులను నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి ప్రసాదించిన అడవులను కాపాడుకుందామ ని, అందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు.

 

తాజావార్తలు