పైలట్‌ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ కు చేయూత

సిఎం కెసిఆర్‌కు చారి కృతజ్ఞతలు
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో గిరిజన మహిళకు పైలట్‌ శిక్షణకు ఆర్థిక సాయం అందించినందుకు సిఎం కెసిఆర్‌కు ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో మైనార్టీ మహిళకు, ఇప్పుడు జిల్లాలో గిరిజన మహిళకు సిఎం చొరవ కారణంగా పైలట్‌ శిక్షణ దక్కబోతోందన్నారు. ఇది కెసిఆర్‌ ఉదారదృష్టితో తీసుకున్న నిర్ణయమన్నారు. ఇందుకు జిల్లా ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.  దండేపల్లి మండలం కర్ణపేట గ్రామానికి చెందిన ఆజ్మీరా బాబి అనే గిరిజన మహిళ విమాన పైలట్‌ శిక్షణకు ఎంపికైంది. ఈమె దేశంలో పైలట్‌ శిక్షణకు ఎంపికైన తొలి గిరిజన మహిళ. పైలట్‌ శిక్షణ తీసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.28 లక్షల మేరకు సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. దండేపల్లికి చెందిన ఆజ్మీరా హరిరాంనాయక్‌,, జయశ్రీ దంపతులు విశ్రాంత ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా వీరు మంచిర్యాలలో స్థిరపడ్డారు. బాబి పదో తరగతి వరకు మంచిర్యాలలో.. ఇంటర్మీడియట్‌, డిగ్రీ హైదరాబాద్‌లో చదివింది. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో పీజీ చేసింది. అందులో బంగారు పతకం సాధించింది. అదే విశ్వవిద్యాలయంలో ఎంబీఏ (హెచ్‌ఆర్‌సీ) చేసింది. ఆ తర్వాత అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే పైలట్‌ శిక్షణపై ఆసక్తి పెంచుకుంది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అమెరికాలోని ఫ్లోరిడాలోని డీన్‌ ప్లయింగ్‌ పాఠశాలలో చేర్పించారు. అక్కడ కొంతవరకు శిక్షణ పొందింది. పూర్తి స్థాయి శిక్షణ నిమిత్తం వెళ్లనుంది. అయితే ఆర్థిక స్థోమత లేని కారణంగా పైలట్‌ శిక్షణ ఆగిపోతుందనుకుంటున్న తరుణంలో సిఎం కెసిఆర్‌ సానుకూలంగా స్పందించారు. దీంతో  ఆమె భవిష్యత్‌కు భరోసా దక్కిందని, ఇది జిల్లాకు ఎంతో గర్వకారణమని చారి అన్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.