పొంచిఉన్న పెనుముప్పు

` ప్రపంచానికి మరో మహమ్మారి అనివార్యం
` డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఉద్ఘాటన
న్యూయార్క్‌(జనంసాక్షి):ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌ ఉద్ఘాటించారు. అది సైద్ధాంతిక ముప్పు కాదని, అటువంటి వ్యాధులు మళ్లీ సంభవించే ప్రమాదం ఉందన్నారు. అయితే, ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ సంసిద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్‌వో పాండమిక్‌ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన టెడ్రోస్‌.. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసానాలను గుర్తుచేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఎదురు చూడదన్న ఆయన.. అది ఎప్పుడైనా సంభవించవచ్చన్నారు. 20ఏళ్లు అంతకంటే ఎక్కువ లేదా రేపే జరగవచ్చని చెప్పారు. ఏదేమైనా అది కచ్చితంగా జరిగి తీరుతుందని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు.‘’కొవిడ్‌-19 మహమ్మారి సృష్టించిన విలయాన్ని అందరం చూశాం. అధికారికంగా 70లక్షల మంది చనిపోయినప్పటికీ.. వాస్తవానికి ఆ సంఖ్య 2కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రాణ నష్టానికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించింది’’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. మహమ్మారి ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజావార్తలు